రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేతలు దుర్మరణం!!

Thursday, June 13th, 2019, 09:46:46 PM IST

విధి వైచిత్రి అంటే ఇదేనేమో! అభినంద‌న కోస‌మ‌ని వెళ్లి అంద‌ని తీరాల‌కు చేరారు ఆ నేత‌లు. అధికార వైసీపీకి చేదు వార్త‌నే మిగిల్చారు. అస‌లేమైంది? అన్న‌ది వివ‌రాల్లోకి వెళితే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికవుతున్న తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపేందుకు సుదూర ప్రాంత‌మైన శ్రీ‌కాకుళం నుంచి వైకాపా నేత‌లు కొంద‌రు అమ‌రావ‌తికి బ‌య‌ల్దేరారు. శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు బస్సులు.. ఐదారు కార్లలో వైసీపీ నాయ‌కులు.. అభిమానులు బుధవారం అర్ధరాత్రి అమరావతికి బయలుదేరారు. ఈ తెల్లవారు జామున తుని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోకి రాగానే వైసీపీ నేతలు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే ఇద్ద‌రు కీల‌క‌ నాయ‌కులు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ధర్మాపురానికి చెందిన పప్పల నారాయణమూర్తి (69), గోరింట గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ బీఎల్‌ నాయుడు (55) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ను తుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిని వారిని వెంటనే మెరగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఉత్త‌రాంధ్ర ఎన్నిక‌ల్లో శ్రీ‌కాకుళం నుంచి వైకాపా జెండా ఏ రేంజులో హ‌వా సాగించిందో తెలిసిందే. జ‌గ‌న్ ఆ జిల్లా అభివృద్ధిని సెంటిమెంటుగానూ ఫీల‌వుతున్నారని స‌మాచారం. ఇలాంటి టైమ్ లో ఈ ప్ర‌మాదం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.