అసెంబ్లీ లో వైసీపీ హద్దులు దాటుతుందా..?

Thursday, July 11th, 2019, 07:19:41 PM IST

ఈ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను గమనిస్తే మాత్రం వైసీపీ దాడిని తట్టుకొని టీడీపీ నిలబడటం అనేది చాలా కష్టమనే తెలుస్తుంది. 151 మంది బలం ఉన్న వైసీపీనీ,23 మంది బలమున్న టీడీపీ ప్రతిఘటించి అసెంబ్లీలో ఉండాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని, అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ నుండి మాట్లాడటానికి అనేక మంది నేతలు రెడీగా ఉంటారు. వాళ్ళని కాచుకొని నిలబడలంటే టీడీపీ తరుపున కూడా గట్టిగా మాట్లాడే నేతలు కావాలి, కానీ అచ్చెన్న నాయుడు, రామానాయుడు తప్ప పెద్దగా మాట్లాడే వాళ్లే కనిపించటం లేదు.

ఇక ఏకంగా చంద్రబాబు నాయుడు సైతం రంగంలోకి అధికారపక్షాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో చంద్రబాబుని అడ్డుకోవాలనే ఉత్సాహంతో అధికారపక్ష సభ్యులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నట్లు అర్ధం అవుతుంది. చంద్రబాబు నాయుడు నోటి నుండి మాట రావటం ఆలస్యం పెద్ద ఎత్తున్న గోల గోల చేస్తున్నారు. ఆ గోలని చూస్తుంటే ప్రతిపక్షము ఏమైనా చేస్తుందా అని అనిపించేలా అధికార పక్ష సభ్యులు చేయటం విడ్డురం. అలాగే బాబు ఏమైనా మాట్లాడితే వెకిలి నవ్వులు, జోకులెయ్యటం లాంటివి కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులతో పాటుగా సీనియర్లు కూడా చేస్తున్నారు .

అధికారపక్షము నుండి బుగ్గల రాజేంద్ర రెడ్డి, రామచంద్ర రెడ్డి, అంబటి రాంబాబు లాంటి కొందరు మాత్రమే సభలో హుందాగా నడుచుకుంటూ ప్రతిపక్ష నేత మాటలకి కొంచం విలువిస్తున్నారు. ఇక్కడ గమనిస్తే చంద్రబాబుకి అడ్డు తగిలితే తమ అధినేత జగన్ దృష్టిలో పడవచ్చనే ఆలోచనతో కొందరు ఇలా చేస్తున్నారు. అయితే బయట మాత్రం సభని హుందాగా నడపాలి. మేము గత ప్రభుత్వం మాదిరి కాదు. మీరే చూడండి అసెంబ్లీ లో అంటూ చెపుతున్న జగన్. సభలో తమ సభ్యుల చేస్తున్న అనవసరమైన గోలని మాత్రం కంట్రోల్ చేయకుండా ముసిముసి నవ్వులు నవ్వుతు కూర్చోటం మంచి పద్దతి కాదు.