‘కుల’గజ్జితో కొట్టుమిట్టాడుతున్న యువత

Saturday, September 13th, 2014, 11:32:33 AM IST


భారాతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం. ఎన్నో జాతులు, ఎన్నో మతాలూ మరెన్నో భాషలతో కలగలిసి ఉండి భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా మన భారతావని అలరారుతోంది. అయితే కాలగమనాన్ని అనుసరించి భారత యువత కులమతాలకు అతీతంగా పురోగమించాల్సింది పోయి కుల ప్రాతిపదికపై సమూహాలను ఏర్పాటు చేసుకుంటూ తిరోగమిస్తున్నారని తాజా నివేదికలో తేలింది. ఈ నేపధ్యంలో సంఘంలోని వివిధ వర్గాలకు చెందిన యువ మేధస్సులను ఒక చోట కలిపి వారి ప్రతిభ వెలికి తీసే యూత్ ఫెస్టివల్స్ కూడా కులానికి పెద్దపీట వేస్తూ కుల ఫెస్టివల్స్ లా మారుతున్నాయి.

ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని కాబోతున్న విజయవాడ నగరంలో ఈ కుల జాడ్యం మరింత వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ జరిగే యూత్ ఫెస్టివల్స్ కు ఏ కులం వారు ఆ కులం వారినే పిలుస్తారట. ఈ నేపధ్యంగా అక్టోబర్ 5న ‘కాపు యూత్ ఫెస్టివల్’ పేరుతో రాష్ట్రంలో ఉన్న కాపు విద్యార్ధులకు పిలుపునిచ్చారు. అయితే విజయవాడలో ఈ కుల ప్రాతిపదిక పైన కేవలం విద్యార్ధులే కాదు రాజకీయ నాయకులు కూడా పబ్బం గడుపుకుంటున్నారని విశ్లేషకులు వివరిస్తున్నారు. రాజధాని కాబోతున్న విజయవాడ నగరంలో ఒక వర్గం వారు అధికంగా ఉండడంతో కుల రాజకీయాలు ఎప్పటి నుండో ఉన్నాయని ఒక ప్రముఖ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. ఇక నగరంలో కాపు యూత్ ఫోర్సు కింద 21,000మంది, కమ్మ యూత్ గ్రూప్స్ కింద 20,000మంది ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు చాందస రాజకీయాల కోసం కొందరు కులాన్ని ఉపయోగినప్పటికీ భావి భారత పౌరులైన యువత కూడా ఈ కులానికి పెద్దపీట వెయ్యడం బాధాకరం. ఇక ఇప్పటి నుంచైనా యువత ఈ కుల తారతమ్యాలను వదిలి అందరిదీ ఒకే కులం భారత కులమని భావించి ముందుకు సాగుతారని ఆశిద్దాం!