జ‌గ‌న్‌ – కేసీఆర్ జోడీ బాబుపై డ‌బుల్ గేమ్!

Monday, June 3rd, 2019, 10:16:56 AM IST

శ‌త్రువులే మిత్రులైతే వారిని ప‌ట్టుకోవ‌డం ఎవ‌రి త‌రం కాదు. అలా క‌లిశారో ప్ర‌త్య‌ర్థుల ప‌ని మ‌టాషే. ఇప్పుడు ఏపీ, తెలంగాణ విష‌యంలో అదే జ‌రుగుతోందా?. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మ‌ధ్య మంచి అనుబంధం పెన‌వేసుకుంది. జ‌గ‌న్‌ని ఓ త‌న‌యుడిలా కేసీఆర్ చూస్తున్నారు. గ‌తంలోనూ నాకు కొడుకు లాంటి వాడ‌ని చెప్పిన కేసీఆర్ అదే విధంగా జ‌గ‌న్‌పై వాత్స‌ల్యాన్ని కురిపిస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో జ‌గ‌న్‌, కేసీఆర్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగినా వాట‌న్నింటినీ ప‌క్క‌న పెట్టి ఇద్ద‌రూ క‌లిసిపోయారు. ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య వున్న అనుబంధం నామ మాత్రం కాద‌ని తాజాగా జ‌గ‌న్ వేసిన అడుగు అందుకు అద్దం ప‌డుతోంది.

చంద్ర‌బాబు ఏపీ ముఖ్య‌మంత్రిగా వున్న‌న్నాళ్లు ఏపీ కోసం తెలంగాణ‌లో కేటాయించిన భ‌వ‌నాల్ని ఖాళీ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు స‌రిక‌దా ఆ విష‌యంలో కేసీఆర్‌ని ముప్పుతిప్ప‌లు పెట్టారు. ఇక హైకోర్టు విభ‌జ‌న కానివ్వ‌కుండా చంద్ర‌బాబు వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. చాలా వ‌ర‌కు విభ‌జ‌న స‌మ‌స్య‌ల్ని అలాగే వ‌దిలేసి గ‌త ఐదేళ్లు చోద్యం చూశారు. కానీ జ‌గ‌న్ మాత్రం అలా చేయ‌డం లేదు. ప‌ద‌విలోకి వ‌చ్చిన మ‌రుక్ష‌ణం నుంచే ఇరు రాష్ట్రాల మ‌ధ్య స‌త్సంబంధాలు వుండాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. అందులో భాగంగానే ఏపీకి తెలంగాణలో కేటాయించిన భ‌వాన‌ల్ని తిరిగి అప్ప‌గిస్తూ గ‌వ‌ర్న‌ర్‌కి లేఖ పంపించ‌డం, దాన్ని ఆమోదిస్తూ గ‌వ‌ర్న‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయింది. ఇది ఇరు రాష్ట్రాల మ‌ధ్య స్నేహ సంబంధాల‌కు తొలి అడుగుగా అభివ‌ర్ణిస్తున్నారు. ఇలాంటి వాతావ‌ర‌ణం రానున్న రోజుల్లో చంద్ర‌బాబుకు సంక‌టంగా మారే అవ‌కాశం వుంద‌ని, ఇద్ద‌రు క‌లిసి చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇది ఒక ర‌కంగా ప‌చ్చ త‌మ్ముళ్ల‌కు- ప‌చ్చ ప‌త్రిక‌ల‌కు డైజెస్ట్ కాని మ‌రిన్ని ప‌రాభ‌వాల‌కు సంకేతం కాబోతోంద‌ని విశ్లేషిస్తున్నారు.