చంద్రబాబు సర్కారు లీలలు ఒక్కొక్క‌టిగా!

Tuesday, June 4th, 2019, 08:50:59 AM IST

ఎన్నికల్లో లబ్ది పొంద‌డ‌మే ధ్యేయంగా చంద్రబాబు స‌ర్కారు అడ్డదారులు తొక్కిందా? అంటే అవున‌నే భోగోతం బ‌య‌ట‌ప‌డింది. రాష్ట్ర ఆర్థిక స్థితి ఏమైతే నాకుంటి? అన్న చందంగా గ‌త ప్ర‌భుత్వం ఏపీలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. అవసరంలేని ఉద్యోగాలకు డెప్యుటేషన్‌పై పంపడమే కాదు.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మరీ వారికి పదోన్నతులు కల్పించిన స్కామ్ తాజాగా బ‌య‌ట‌ప‌డింది. ఏడాదికి పైగా వారిని కూర్చోపెట్టి కోట్లాది రూపాయల జీతాలను చెల్లించింది. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్యంతో సాక్షర భారత్‌ 2010 సెప్టెంబర్‌లో ప్రారంభమై 2018 మార్చిలో నిలిచిపోయింది. దీనిద్వారా విద్యా బోధనకు రాష్ట్ర వ్యాప్తంగా 20,061 మంది మండల, విలేజి కో- ఆర్డినేటర్లు 8 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం ఆగిపోవడంతో వీరందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షర భారత్‌ కార్యక్రమం పర్యవేక్షణకు డెప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను సూపర్‌వైజర్లుగా నియమిస్తారు. సాక్షర భారత్‌ నిలిచిపోవడంతో మండల, విలేజి కో–ఆర్డినేటర్ల మాదిరిగానే ఈ సూపర్‌వైజర్ల అవసరం కూడా లేకుండాపోయింది. దీంతో వీరిని వారి మాతృసంస్థకు పంపేయాల్సి ఉంది. అలా చేయకపోగా అదనంగా సూపర్‌వైజర్లను నియమించి జీతాలిచ్చి ఖ‌జానాకు చిల్లు పెట్టార‌ని తెలిసింది.

ఇటీవల ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ప‌లువురికి ప‌దోన్న‌తులివ్వ‌డం వివాదాస్ప‌దం అయ్యింది. 166 మందికి గడచిన 14 నెలలుగా సాక్షర భారత్‌ లేకపోయినా కూర్చోబెట్టి చంద్రబాబు ప్రభుత్వం రూ.14.72 కోట్లు జీతాల రూపంలో చెల్లించింది. ఈ వ్యవహారంలో త్వరలో పదవీ విరమణ చేయనున్న వయోజన విద్య రాష్ట్ర డైరెక్టర్‌ పాత్ర ఉందని తెలుస్తోంది. సాక్షర భారత్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల్లోకి డెప్యుటేషన్‌పై వెళ్లడానికి ఉపాధ్యాయులు ఉబలాటపడటానికి కారణాలున్నాయి. బడిలో రోజూ పాఠాలు చెప్పే పనుండదు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో సమీక్షలు.. పర్యటనలు పేరిట రూ.10 వేల వరకు జీతానికి అదనంగా వస్తుంది. దీంతో వీటిపై మోజెక్కువ‌. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వేళ మండల, విలేజి కోఆర్డినేటర్లు, ఆ కుటుంబాల ఓట్ల కోసం గాలం వేసింది. తొలగించిన 20,061 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. వారిలో నమ్మకం కుదర్చడానికి అవసరం లేకపోయినా మండల కోఆర్డినేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు రెండు నామమాత్రపు మెమోలు జారీ చేసింది. శిక్షణకయ్యే ఖర్చు మొత్తాన్ని జిల్లా సాక్షరత సమితి నిధుల నుంచి విడుదల చేయాలని ఆయా కలెక్టర్లకు సూచించింది. కొన్ని జిల్లాల కలెక్టర్లు నిధులు విడుదల చేసినా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందంటూ తిరస్కరించారు. మిగిలిన జిల్లాల్లో కోట్లాది రూపాయలు అవసరం లేకున్నా కట్టబెట్టార‌ని తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని ఆర్టీఐ యాక్ట్‌ అండ్ కన్జూమ‌ర్‌ అఫైర్స్‌ స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌ కాండ్రేగుల వెంకటరమణ సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి తెచ్చారు. న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విష‌య‌మై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది.