జగన్.. వారిని కూడా ఒక చూపు చూడరాదు !

Wednesday, June 5th, 2019, 01:39:18 PM IST

అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఉత్తమ ముఖ్యమంత్రి అనే పేరు తెచ్చుకునేలా తన పాలన ఉంటుంది అని ప్రమాణస్వీకారానికి ముందే జగన్ మాటిచ్చారు. ప్రస్తుతం ఆయన పనితీరు చూస్తే ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నాల్లోనే ఉన్నారని అర్థమవుతోంది. పదవిలోకి వచ్చినప్పటి నుండి కీలకమైన శాఖలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు.

మొదట మధ్యాహ్నా భోజన నిర్వాహకుల వేతనాన్ని 1000 నుంచి 3000లకు పెంచిన ఆయన ఆశావర్కర్ల వేతనాన్ని ఒక్కసారిగా 10000లకు పెంచేసి నీరాజనాలు అందుకున్నారు. కానీ ముఖ్యమైన నిరుద్యోగ యువత వైపు ఆయన ఇంకా దృష్టి పెట్టలేదు. గతంలో టీడీపీ హయాంలో నిరుద్యోగులు నెలసరి భృతి కింద 1000 రూపాయలు అందుకునేవారు. ఎన్నికల ముందు ఆ మొత్తాన్ని 2000లకు పెంచుతూ అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కానీ భృతి 2000లకు ఇంకా పెరగలేదు. అసలు గతంలో ఇస్తున్న 1000 కూడా ఈసారి ఇంకా లబ్దిదారుల ఖాతాల్లోకి చేరలేదు.

దీంతో వైకాపా ప్రభుత్వం ఆ పథకాన్ని తొలగించనుందనే ప్రచారం ఊపందుకుంది. నిరుద్యోగుల్లో ఇకపై భృతి అందదనే ఆందోళన మొదలైంది. ఇది కాస్త ప్రభుత్వ వ్యతిరేకతగా మారమ ముందే జగన్ నిరుద్యోగుల వైపు ఒక చూపు చూసి వారికి త్వరితగతిన ఉద్యోగావకాశాలు ఏర్పడే చర్యలు తీసుకుంటే మంచిది.