పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్న జగన్

Thursday, June 13th, 2019, 09:22:18 AM IST

ముఖ్యమంత్రిగా భాద్యతలు తీసుకున్న మరుక్షణమే పోలవరం ప్రాజెక్ట్ మీద కసరత్తు మొదలుపెట్టారు జగన్. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలగా పోలవరాన్ని భావించి తన హయాంలోనే దాన్ని పూర్తిచేయాలని ఆయన గట్టిగా నిశ్చయించుకున్నారు. అందుకే కేంద్రం నుండి రావాల్సిన నిధుల్ని రప్పించాలని సమీక్షలు నిర్వహించారు. గతేడాది నుండి కేంద్రం నుండి నిధులు ఎందుకు అందడంలేదని విషయంపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో 2014 ఏప్రిల్ 1కి ముందు పోలవరం కొమ్మా ఖర్చు చేసిన నిధులపై ఆడిట్ పంపాలని అప్పటి ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ కోరగా అందుకు ప్రభుత్వం నిరాకరించింది. అందుకు కారణం అనినీతే అని అంటున్నారు.

ఆడిట్ అందనందున కేంద్రం నిధుల్ని విడుదలచేయలేదు. ఈ సంగతి గుర్తించిన జగన్ 2014 ఏప్రిల్‌ 1వ తేదీకి ముందు భూసేకరణ, సహాయ పునరావాస పనులకు చేసిన వ్యయంపై ఆడిట్‌ చేయించి, స్టేట్‌మెంట్‌ చేసి పీపీఏ ద్వారా కేంద్ర జలవనరుల శాఖకు పంపాలని ఆదేశించారు. ఈ సంగతిని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తెలుపగా రూ.3,000 కోట్లు విడుదల చేయాలంటూ కేంద్ర జలవనరుల శాఖకు పీపీఏ ప్రతిపాదనలు పంపింది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ప్రతిపాదించారు. ఈ మొత్తాన్ని నాబార్డు ద్వారా విడుదలచేయనున్నారు. మరో రూ. 1810.04 కోట్ల మంజూరుపై కూడా కసరత్తులు జరుగుతున్నాయి.