టీడీపీ నేతలు ఇక మీ సేవలు చాలంటున్న జగన్

Tuesday, June 11th, 2019, 08:30:06 AM IST

గెలిచిన 151 మంది ఎమ్మెల్యేల్లో 25 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించిన జగన్ రెండున్నరేళ్ల తరవాత కేబినెట్ విస్తరణ చేపట్టి మిగిలిన వారికీ అవకాశం ఇస్తామని చెప్పారు. ఇంకొందరికి విప్ పదవులు కట్టబెట్టారు. అయినా ఆశావహులు చాలా మంది ఎలాంటి పదవులు లేకుండా మిగిలిపోయారు. దీంతో జగన్ అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ హయాంలో నియమించిన అన్ని నామినేటెడ్ కమిటీలను, బోర్డు పాలక మండళ్లను రద్దు చేసి వాటి స్థానంలో వైకాపా నేతలతో కూడిన కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు.

అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే పలువురు టీడీపీ నేతలు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి ముందుగానే పదవులకు రాజీనామాలు చేసి పక్కకు తప్పుకోగా ఇంకా కొందరు నేతలు నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. వారందరూ కూడా రాజీనామా చేసేలా జగన్ ఆదేశాలివ్వనున్నారు. దీంతో అనేక నామినేటెడ్ పదవులు ఖాళీ కానున్నాయి. మంత్రి పదవులు ఆశించి భంగపడిన చాలామంది వైకాపా నేతలు ఇప్పటి నుండే తమకు పలానా పోస్ట్ కావాలని అధిష్టానంతో రాయబారాలు నడుపుతున్నారు. మొత్తానికి జగన్ పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం చేయడానికి శతవిధాలా యత్నిస్తున్నారు.