అంచనాలను అందుకున్న వైఎస్ జగన్

Tuesday, June 11th, 2019, 04:22:30 PM IST

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకున్నాక తొలిసారి నిన్న మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. కీలకమైన హామీల నేపథ్యంలో జరిగిన ఈ భేటీ పట్ల అందరూ పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. అందరి అంచనాలను అందుకుంటూ జగన్ సమావేశాన్ని నడిపారు. దాదాపు అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారు.

ఉద్యోగులకి 27 శాతం ఐఆర్ అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల కమ్రబద్దీకరణ అంగన్వాడీలు, హోంగార్డులకు జీతాలు పెంపు, గ్రామ, వార్డు వాలంటీర్లు, రైతు భరోసా, 9 గంటల ఉచిత కరెంట్, ఉచిత బోర్లు, అమ్మ ఒడి కింద 15000 నగదు అంజేయడం, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంపు, ఉచిత ఇళ్ళు ఇలా పేద, మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసే పథకాలను అమలుచేయాలని సీఎం డిసైడ్ అయ్యారు.

ఈ పథకాలను విన్న జనం సీఎం మేనిఫెస్టోలో చెప్పినవాటికంటే అదనంగానే సంక్షేమ పథకాలని అమలుచేసేలా ఉన్నారని, చెప్పిన పనులన్నీ అవినీతికి తావులేకుండా నిర్వహించగలిగితే ఎంతో లబ్ది చేకూరుతుందని అంటున్నారు. పైగా మంత్రులకు అవినీతికి తావిస్తే కఠిన చర్యలు ఉంటాయని జగన్ హెచ్చరించడం జనానికి ఇంకా నచ్చింది. ఇలా జగన్ మొదటి మంత్రివర్గ సమావేశంలోనే జనం నుండి అభినందనలు అందుకోవడం నిజంగా ఆయన సుదీర్ఘ పాలనకు సహకరించే విషయం.