కేసులకు భయపడే ఈటల బీజేపీలో చేరుతున్నారు – వైఎస్ షర్మిల

Wednesday, June 9th, 2021, 08:35:31 PM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల తొలిసారి మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంపై స్పందించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో ఈటలను వైఎస్ షర్మిల పార్టీలోకి ఆహ్వానించారు. కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారని, ఆయన తమ పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తామని ఆమె అన్నారు. అయితే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అని అలాగే కేసులకు భయపడి బీజేపీలో చేరడం కూడా కామన్ అయిపోయిందని షర్మిల ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంటే కరోనాను ఎదురుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయ్యిందని షర్మిల ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు విమర్శించుకోవడానికే పరిమితమయ్యారని అన్నారు. టేబుల్ ఫ్యాన్ తమ పార్టీ గుర్తు అంటూ ప్రచారం జరుగుతుందని అందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని పార్టీ విధి, విధానాలు రూపొందిస్తామని, ప్రజల అజెండాను తమ పార్టీ అజెండా అని అన్నారు. ప్రజలు 8374167039 వాట్సాఫ్ నెంబర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకోవచ్చని అన్నారు.