వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు ప్రకటించేందుకు ముహూర్తం ఫిక్స్..!

Tuesday, March 2nd, 2021, 12:29:42 AM IST


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీపై స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు జిల్లాల నేతలు, పలు సంఘాల ప్రతినిధులతో వరుస సమావేశాలు జరుపుతున్న వైఎస్ షర్మిల త్వరలో పార్టీ పేరును ప్రకటించబోతుంది. ఇందుకోసం ఏప్రిల్ 9వ తేదిని ముహూర్తంగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించబోతున్నారు.

అయితే షర్మిల పెట్టబోయే కొత్త పార్టీకి వైఎస్ఆర్ టీపీ, వైఎస్ఆర్ పీటీ, రాజన్న రాజ్యం పేర్లను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ తేదిన కొత్త పార్టీనీ ప్రకటించబోతున్నారని, లేదంటే జూలై 8న వైఎస్ఆర్ జయంతి రోజు కావడంతో ఆ రోజు ప్రకటించబోతున్నారని తొలుత ప్రచారం జరిగింది. అయితే 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన 1500 కిలోమీటర్ల పాదయాత్ర ఏప్రిల్ 9వ తేది కావడంతో అదే రోజు ఖ‌మ్మంలో చివ‌రి ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వహించి పార్టీ పేరును ప్రకటించాలని మరియు పార్టీ గుర్తుతో పాటు పార్టీ విధి విధానాలు ఏంటనేది కూడా తెలియజేయనున్నట్టు సమాచారం.