సీఎం కేసీఆర్‌పై మరోసారి మండిపడ్డ వైఎస్ షర్మిల..!

Wednesday, March 31st, 2021, 04:48:30 PM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల అందుకు తగ్గట్టుగానే వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల అనుచరులతో వరుసగా భేటీ అవుతున్న షర్మిల తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ జిల్లా అని చెప్పుకునే మెదక్ జిల్లాలో 20 కరువు మండలాలు ఉండడం బాధాకరమని అన్నారు.

అంతేకాదు పటాన్‌చెరు ప్రాంతంలో కాలుష్య పెరిగిపోయిందని, మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వారికి ఇంకా న్యాయం జరగలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, యువతకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా మెదక్ జిల్లాకు 5.19 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించాలని వైఎస్సార్ భావించారని దానిని రీడిజైన్ చేసిన నాయకులు ఇప్పటి వరకు ఏం చేశారో తెలియదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.