వైఎస్ వివేకా హత్య కేసు నిగ్గు తేల్చాల్సిందే.. విజయమ్మ బహిరంగ లేఖ..!

Monday, April 5th, 2021, 11:34:18 PM IST


ఏపీ సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని ఆయన కూతురు సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ఈ హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌పై ప్రత్యర్ధుల నుంచి అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ అంశంపై స్పందించిన దివంగత సీఎం వైఎస్సార్ సతీమణి, సీఎం జగన్ తల్లి విజయమ్మ బహిరంగ లేఖ రాశారు.

వైయస్‌ వివేకానందరెడ్డిగారు మా మరిది అని, ఆయనను ఎవరు హత్య చేశారన్నది ఖచ్చితంగా నిగ్గు తేలాల్సిందేనని అన్నారు. దీనిపై సీఎం జగన్‌, షర్మిల, తనిది ఒకే మాట అని, మా కుటుంబంలో ఎప్పటికీ భిన్నాభిప్రాయాలు లేవని అన్నారు. వివేక హత్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిందని ఆ హత్య తరవాత రెండున్నర నెలలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ హత్యకు సంబంధించి ఆయన మంత్రి, పార్టీ ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డి పాత్రమీద అనేక అనుమానాలున్నాయని ఆమె అన్నారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని అది తెలిసీ కూడా కొందరు జగన్ బాబుపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

ఈ హత్యకు సంబంధించి దోషులెవరు అన్న విషయం తేలాలని, వారికి శిక్ష పడాలని సునీతతో పాటు తాము కూడా కోరుకుంటున్నట్టు విజయమ్మ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న ఊహాగానాలపై కూడా విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. జగన్‌కు, షర్మిలకు ఉన్నది వేర్వేరు అభిప్రాయాలే తప్ప వారిద్దరి మధ్య విభేదాలు లేవని అన్నారు. నా బిడ్డలమధ్య విభేదాలు తీసుకురావాలని కొందరు దిగజారుడు ప్రయత్నాలు చేస్తున్నారని అది ఏనాటికి జరగని పని అన్నారు.