జగన్ ప్రమాణ స్వీకారాలలో కనిపించిన రాజన్న గుర్తులు..!

Wednesday, June 12th, 2019, 05:23:12 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అయితే నేడు అసెంబ్లీ సమావేశాలలో సీం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాక, టీడీపీ అధినేత చంద్రబాబు మరియు మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం చేసారు.

అయితే గత తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ పాదయాత్ర ద్వారా ప్రతి గడపకి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకుని నేనున్నాను అంటూ పేదోడి గుండెల్లో ధైర్యాన్ని నింపాడు జగన్. అయితే ఒక్క సారి అవకాశం ఇవ్వండి రాజన్న రాజ్యం మళ్ళీ మీ కళ్ళ ముందు ఉంచుతా అంటూ ప్రమాణం కూడా చేశాడు. అయితే అందరూ అనుకున్నట్టుగానే ఈ సారి ఎన్నికలలో వైసీపీకి భారీ మెజారిటీని అందించి జగన్‌కు పట్టం కట్టారు ఏపీ ప్రజలు. అయితే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తాను చెప్పినవన్ని ఒకదాని తరువాత ఒకటి అమలు చేస్తూ, అవినీతిరహిత పాలనను అందించే దిశగా కసరత్తులు కూడా మొదలు పెట్టారు.

అయితే తన తండ్రి చనిపోయి 10 సంవత్సరాలు దాటిపోయినా తన తండ్రి జ్ఞాపకాలు మాత్రం భద్రంగా దాచుకున్నాడు జగన్. మే 30 న ప్రమాణ స్వీకారం చేసిన రోజున తన తండ్రి మరణించిన సంఘటనలో దొరికిన తన తండ్రి వాచ్‌ను పోలీసులతో అడిగి మరీ ఇప్పించుకుని దానిని బాగు చేసుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున ఆ వాచ్ పెట్టుకున్నాడు. అయితే నేడు ఎమ్మెల్యేగా శాసన సభలో ప్రమాణం చేసి సంతకం చేసేటప్పుడు అక్కడ ఉన్న పెన్ తీసుకోబోగా ప్రభుత్వ ఉద్యోగి ఒకరు నాన్న గారి పెన్‌తో సంతకం పెట్టండి సార్ అని చెప్పగా జగన్ తన జేబ్‌లో తండ్రి గుర్తుగా దాచుకున్న పెన్‌తో దర్జాగా సంతకం పెట్టారు. ఆ సన్నివేశం చూసిన అందరికి రాజన్నే దిగి వచ్చి సంతకం పెట్టినట్టు అనిపించిందట.