మేలు చేస్తే సరి..లేదంటే ఉద్యమమే..

Thursday, October 16th, 2014, 04:50:28 PM IST

Srinivas-Reddy-ysr
ప్రజలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గింది అనడం అబద్దమని.. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని.. ప్రజల మనసెరిగి పనిచేసిన వ్యక్తి వైఎస్ఆర్ అని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం గురించి చర్చించినట్టు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు మంచి చేస్తే.. తాము భేషరతుగా మద్దతు ఇస్తామని అన్నారు. అలాకాకపోతే.. తాము ప్రజల తరుపున ఉద్యమిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వానికి ముందుచూపు కొరవడిందని.. ఫలితంగానే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యలగురించి పట్టించుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా సమీక్ష జరుగుతున్నదని.. సమీక్ష అనంతరం..జిల్లాలో ప్రజల సమస్యల గురించి పర్యటిస్తామని పోగులేటి తెలియజేశారు.