ఆ పదవి మాకొద్దు అంటున్న వైసీపీ నేతలు.. జగన్‌కి ఇది పెద్ద సవాల్..!

Saturday, June 1st, 2019, 12:52:04 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. అయితే రెండు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే మొన్న ముఖ్యమంత్రిగా జగన్ ఒక్కడే ప్రమాన స్వీకారం చేశాడు. అయితే ఆయన మంత్రివర్గ కేబినెట్‌ను వీలైనంత త్వరగా నియమించాలని ఇప్పటికే కొన్ని పేర్లను కూడా పరిశీలించారట. అయితే జూన్ 8 న 15 మందితో తన కేబినెట్ బృందాన్ని ప్రకటించబోతున్నారట.

ఇదిలా ఉండగా వైసీపీ అధినేత సీఎం జగన్ కీలకమైన పదవిని ఇస్తానన్నా పార్టీ నేతలు మాత్రం స్వీకరించడానికి సుముఖంగా లేరని అర్ధమవుతుంది. ఇంతకీ ఆ కీలకమైన పదవి ఏంటబ్బా అనుకుంటున్నారా అదే స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవి. శాసనసభాపతి పదవి అత్యంత గౌరవప్రదమైనది, రాజ్యాంగ బద్ధమైనదీ అయినప్పటికీ ఈ బాధ్యతలను నిర్వర్తించడానికి వైసీపీ నేతలు భయపడుతున్నారట. అయితే వీరు ఇంతలా భయపడడానికి కారణాలు కూడా లేకపోలేదు. అయితే గత రెండు దశాబ్ధాల నుంచి ఈ పదవిలో కొన్సాగిన వారు తిరిగి వచ్చే ఎన్నికలలో ఓడిపోవడమే దీనికి అసలు కారణమట. అందుకే ఈ పదవిలో కొనసాగితే వచ్చే 2024 ఎన్నికలలో ఓటమి పాలవ్వడం ఖాయమని అదే సెంటిమెంట్‌గా వస్తుందని ఈ పదవి మకొద్దని తెగేసి చెబుతున్నారట వైసీపీ నేతలు.

అయితే 1999లో టీడీపీ గెలుపొందగా అప్పుడు కె ప్రతిభా భారతి స్పీకర్‌గా పని చేశారు. ఈమె 2004 ఎన్నికలలో ఓడిపోయారు. ఇక 2004 ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తే కెఆర్‌ సురేష్‌రెడ్డి స్పీకర్‌గా పని చేశారు. అయితే 2009 ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ గెలిచినా కెఆర్‌ సురేష్‌రెడ్డి మాత్రం గెలవలేకపోయారు. 2009లో ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌గా పదవి బాధ్యతలు చేపట్టి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే 2014 ఎన్నికలలో మాత్రం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీనీ వీడి, జైసమైక్యాంధ్ర పార్టీని పెట్టినా ఓటమి పాలయ్యాడు. 2014లో నవ్యాంధ్రలో స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావు కూడా ఈ ఎన్నికలలో ఓడిపోయారు. అంతేకాదు తెలంగాణలో కూడా ఇదే సెంటిమెంట్ కొనసాగుతుంది. తెలంగాణ తొలి స్పీకర్‌గా పని చేసిన మధుసూదనాచారి కూడా ఈ ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. అయితే ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి మేము కూడా స్పీకర్ పదవిలో కూర్చుంటే ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని వచ్చే ఎన్నికలలో ఓడిపోతామని అది తెలిసి కూడా ఈ పదవిని స్వీకరించలేమని కొందరు సీనియర్ వైసీపీ నాయకులు జగన్‌కి తేల్చి చెప్పేశారట. అయితే ఇలాంటి తరుణంలో అసలు జగన్ ఆ భాద్యతను ఎవరికి అప్పచెప్పబోతున్నారు, ఎవరూ స్వీకరించబోతున్నారు అనేది మాత్రం కాస్త సస్పెన్స్‌గానే మారిందని అర్ధమవుతుంది.