కోడెల మృతిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సరికొత్త డిమాండ్..!

Tuesday, September 17th, 2019, 11:33:24 PM IST

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిన్న చనిపోయారు. వరుస కేసుల విషయంలో మానసికంగా బాగా కుంగిపోయిన కోడెల నిన్న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చానీయాంశంగా మారింది. అయితే కోడెల ఆత్మహత్యపై స్పందించిన టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

అయితే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు నేడు మీడియాతో మాట్లాడుతూ కోడెల శివప్రసాద్ తన జీవితంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని, వరుస కేసులు కోడెల మనోభావాన్ని పతనం చేశాయని, అలాంటి సమయంలో టీడీపీ నేతలు ఎవ్వరూ ఆయన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. అయితే ఇలాంటి దారుణమైన పరిస్థితిలో కొడెల మరణించడం బాధాకరం అని అన్నారు. అయితే కోడెల మృతికి బాధ్యత వహించాల్సింది ఆయన కుటుంబసభ్యులు, తెలుగుదేశం పార్టీ తప్ప ప్రత్యర్థి రాజకీయపార్టీ కాదని, బ్రతికున్నప్పుడు కోడెలపై టీడీపీకి లేని ప్రేమ ఇప్పుడెందుకు అని, కోడెల కుటుంబంపై చంద్రబాబునాయుడుకి నిజంగా ప్రేమాభిమానాలు ఉంటే, ఆయన వారసులుగా కొడుకుని, కూతురుని ప్రకటించాలని కోరారు. అంతేకాదు నరసరావుపేట, సత్తెనపల్లి నుంచి కొడుకు, కూతుర్లకు అవకాశం కల్పించాలని అన్నారు.