బిగ్ బ్రేకింగ్: వైసీపీ పాలనపై ఎమ్మెల్యే రజనీ సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, June 11th, 2019, 12:10:49 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా రెండు రోజుల క్రితం జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అంతేకాదు వినూత్న నిర్ణయాలతో పాలనను పరుగులు పెట్టిస్తూ ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. అయితే అవినీతి రహిత పాలనను అందిస్తానని ఇదివరకే ప్రజలకు హామీ కూడా ఇచ్చారు. అంతేకాదు తమ పాలనలో అవినీతి అనేది ఉండకూడడని దానికి తగ్గట్టుగా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.

అయితే వైసీపీ పాలనపై చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒక ఎడ్యుకేటెడ్ ప‌ద్ధ‌తి ప్రకారం ప‌రిపాల‌న‌ను సాగిస్తుందని వైసీపీ పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని ఆమె అన్నారు. సీఎం జగన్ ప్రతి పేద వాడి కష్టాన్ని చూసారని, తప్పకుండా అందరికి న్యాయం చేస్తారని అన్నారు. అంతేకాదు జగన్ మాపై ఉంచిన నమ్మకానికి వంద రెట్లు ప్రజలు మాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు తప్పకుండా అందరికి న్యాయం చేస్తామని అన్నారు. చిల‌క‌లూరిపేట‌లోని కొన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జరిగిన‌ట్టు త‌న దృష్టికి వ‌చ్చింద‌ని, ఎలాంటి అవకతవకలకు, ఒత్తిళ్లకు వైసీపీ ప్రభుత్వం తావు ఇవ్వబోదని, అధికారులు స్వేచ్చగా తమ విధులను నిర్వర్తించి ప్రజ సేవకు తమ వంతు సేవ చేసుకోవాలని అన్నారు. జగన్ మంత్రివర్గంలో స్థానం కోసం మీరు ఏమైనా ఆశించారా అని అడగగా పదవుల కోసం రాజకీయాలలోకి రాలేదని, ప్రజా సేవ కోసమే తాను రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. అయితే ప్రజలు ఆశీర్వదించినట్టే దేవుడి ఆశీస్సులు కూడా ఉంటే ఎంతటి పదవులైనా దక్కడం సులభమే అని ఆమె అన్నారు.