ఏపీఐఐసీ గురించి తెలుసా..? రోజా లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే

Wednesday, June 12th, 2019, 05:14:01 PM IST

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి కావటంతో ఆయన మొదటి మంత్రి వర్గంలో ఉండటానికి చాలా మంది MLA లు పెద్ద స్థాయిలోనే లాబీయింగ్ లు చేశారు కానీ,కొందరికి మాత్రమే ఫలించాయి. మరికొందరికి మొండి చెయ్యి ఎదురైయ్యింది. అయితే ఎలాంటి లాబీయింగ్ తో సంబంధం లేకుండా జగన్ మంత్రి వర్గంలో ఖచ్చితంగా ఉంటుందని అనుకున్న పేరు రోజా. కానీ మంత్రివర్గంలో మాత్రం ఆమెకి చోటు దక్కలేదు. కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్లు రోజాకి మంత్రి పదవి రాకపోవటానికి కూడా చాలా కారణాలే ఉన్నాయి.. కుల ప్రాదిపదికన కావచ్చు,లేదా చిత్తూరు జిల్లాలో సీనియర్ అయిన పెద్దిరెడ్డి కాదని రోజాకి ఇవ్వలేని పరిస్థితి కావచ్చు. అలాగే సీనియారిటీ, ఇలా పలు అంశాలు ఆధారంగా ఆమెకి మంత్రి పదవి దక్కలేదు.

కారణాలు ఏమైనా కావచ్చు కానీ, మంత్రి పదవి రాకపోవటంతో రోజా చాలా నిరాశలో కూరుకొనిపోయింది.. తన నిరసనని పార్టీ పెద్దలకి చేరవేసింది. అదే విధంగా సోషల్ మీడియాలోను రోజాకి మంత్రి పదవి రాకపోవటం మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనితో ఆలోచనలో పడిన వైసీపీ అధినాయకత్వం రోజాని బుజ్జగించే పని ప్రారంభించింది. ఏకంగా జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రోజాతో ఈ విషయం గురించి మాట్లాడాడు, అంతే కాకుండా ఆమెకి మంచి పదవి ఇస్తానని చెప్పాడు. చెప్పినట్లే ఆమెకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ( ఏపీఐఐసీ ) చైర్ పర్సన్ పదవి ఇవ్వటం జరిగింది. ఏపీఐఐసీ అనేది చిన్న సంస్థ ఏమి కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఇండస్ట్రీస్ కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగాలన్న వాటికీ సంబంధించి రోడ్స్, డ్రైనేజీ, వాటర్, పవర్ ఇలా అనేక రకాలైన వాటికీ ఖచ్చితంగా ఏపీఐఐసీ అనుమతి తప్పనిసరి.

ఉమ్మడి రాష్టంగా ఉన్నప్పుడు ఈ సంస్థ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేపట్టింది. హైదరాబాద్ కే తలమానికంగా చెప్పుకునే హైటెక్ సిటీ, విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై,గంగవరం పోర్ట్, పరవాడ లోని కన్వెన్షన్ సెంటర్ అండ్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ మొదలైనవి ఈ సంస్థ ఆధ్వర్యంలోనే నిర్మాణం జరిగాయి. ముఖ్యంగా “స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ” (సెజ్) కి సంబదించిన అన్ని ప్రాజెక్ట్స్ ఈ సంస్థ కిందకే వస్తాయి.. రహేజా మైండ్ స్పేస్ ప్రాజెక్ట్ కూడా ఏపీఐఐసీ అండర్ టేకింగ్ లోనే జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సంస్థకి రోజా చైర్ పర్సన్ కావటం విశేషమే అని చెప్పాలి. మంత్రి పదవి దక్కలేదని బాధపడుతున్న రోజాకి ఈ పదవి వరించటంతో ఆమె చెప్పలేనంత సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది.