అమరావతి పేరు మారుస్తున్నారా…? వైసీపీ ఎమ్మెల్యే మాటల వెనక ఆంతర్యం ఏంటి…?

Thursday, February 27th, 2020, 03:00:39 AM IST

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దీ రోజులుగా రాష్ట్ర రాజధాని విషయమై అటు ప్రభుత్వనికి మరియు ప్రజలకు మధ్యన ఒక రకమైన పోరాటం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా రాష్ట్రానికి మూడు రాజధానులను నిర్మిస్తామని సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి తరలించొద్దని, అమరావతిలోనే శాశ్వత రాజధానిని ఏర్పాటు చేయాలనీ అమరావతి నిర్మాణానికి తమ భూములను ఇచ్చిన రైతులు, ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేసిన వాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

కాగా ఏపీ రాజధాని అమరావతి పేరును ఆయన మార్చుతున్నామని వాఖ్యానించారు. అయితే ఇప్పటినుండి అమరావతి ని ‘బహుజన అమరావతి’ గా పిలవాలని వాఖ్యానించారు. అంతేకాకుండా సీఎం జగన్ నిర్ణయం తరువాత అమరావతి ‘బహుజన అమరావతి’ అవుతుందని, ఆ తరువాత ‘సర్వజన అమరావతి’ అవుతుందని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇకపోతే రాజధాని అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వర్గాల్లోని 54 వేల మంది పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలను కేటాయించబోతున్నామని వాఖ్యానించారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా వాఖ్యానించడం అనేది ప్రస్తుతనికి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.