చంద్రబాబుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..!

Tuesday, July 23rd, 2019, 07:19:44 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి.

అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ వైఖరిపై సంచలన ఆరోపణలు చేసారు. అయితే సభలో మాట్లాడేందుకు తమ ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఇచ్చినా టీడీపీ గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేలు 63 మంది ఉన్నా మాట్లాడడానికి అవకాశం ఇచ్చే వారు కాదని, సభలో ఏదైనా మాట్లాడాలనుకుంటే అధ్యక్షా మైక్ అని అడ్డుకోవాల్సి వచ్చేదని, గతంలో మా అధినేతను ఉద్దేశించి నువ్వు మగాడివా మగతనం ఉందా అని అడిగే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు కించపరిచారని, దానికి తోడుగా చంద్రబాబు చప్పట్లు కొట్టారని అయినా సహించామని అన్నారు. అయితే ప్రస్తుతం మా ప్రభుత్వం అధికారంలో ఉందని మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంతేకాదు స్వయంగా గవర్నర్ గారే తమ ముఖ్యమంత్రిని కొనియాడారని అది చూసి తట్టుకోలేకే తమ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వీరి ఆటలు ఇకనైనా మానకపోతే ఊరుకునేది లేదని చంద్రబాబును హెచ్చరించారు.