జగన్ నాయకత్వంలో స్పష్టంగా కనిపించిన ఎమ్మెల్యేల అసంతృప్తి..!

Wednesday, June 12th, 2019, 06:48:06 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే నాలుగు రోజుల క్రితం జగన్ తన కేబినెట్‌ను కూడా ప్రకటించి వారితో కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాడు. అయితే తన మంత్రివర్గంలో 25 మందికి చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు సీఎం జగన్. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా తన మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి 6, బీసీలకు 7, కాపులకు 4, కమ్మ సామాజిక వర్గానికి 1, క్షత్రియ సామాజిక వర్గానికి 1, ఎస్సీలకు 4, ఎస్టీ లకు 1, ఆర్య వైశ్య 1, మైనారిటీ సామాజిక వర్గానికి 1 చొప్పున మంత్రి పదవులు కేటాయించారు. అంతేకాదు తన కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలను కూడా నియమించారు.

అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం బాగా ఉందంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే మంత్రి పదవులు ఆశించి భంగపడిన సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు కాస్త అసంతృప్తితో ఉన్నారట. అయితే ఇప్పుడు ఎన్నికైన మంత్రుల పదవి కాలం కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత పార్టీలో మిగిలిన వారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించినా కూడా వీరి అలక మానలేదు. మొత్తం వైసీపీలో సీఎం జగన్‌ను మినహాయిస్తే 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే జగన్ మంత్రివర్గ పేర్లను ప్రకటించే రోజున మొత్తం మంది ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే తమ పేర్లు ఉంటాయని ఆశించి తమకు చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన ఎమ్మెల్యేలు తమ సొంత పార్టీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే దాదాపు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు కార్యక్రమానికి హాజరు కాలేదు. దీనిని బట్టి చూస్తుంటే జగన్‌కు అప్పుడే తన ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తి ఏర్పడిందని రాజకీయాలలో చర్చలు నడుస్తున్నాయి.