వైసీపీ ఎంపీకి చేదు అనుభవం : కావాలంటే నా డెత్ సర్టిఫికెట్ లో చూడండి…?

Monday, December 16th, 2019, 07:39:49 AM IST

విశాఖ పట్టణములో ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో అధికార పార్టీ ఎంపీ కి దారుణమైన చేదు అనుభవం ఎదురైంది. ఎంతలా అంటే చివరికి తన రిజర్వేషన్ కోసం తానే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా విశాఖపట్టణం కంబాల కోట ప్రాంతంలో పలువురు ప్రముఖులు కొందరు ‘కాపుల ఆత్మీయ కలయిక’ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. అయితే అక్కడ వైసీపీ ఎంపీ కి వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు.

కాపుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో కొందరు “జై కాపు.. జై జై కాపు” అంటూ పెద్దగా కొన్ని నినాదాలు చేశారు. అంతేకాకుండా మా కాపుల సభకు వైసీపీ నేతలను ఎందుకు తీసుకు వచ్చారని తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే మధ్యలోనే కలగజేసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… “నేను కూడా కాపునేనని.. చనిపోయే ముందు నా డెత్‌ సర్టిఫికేట్‌లో కాపు అని రాసి ఉంటుందని” వివరణ ఇచ్చారు. ఇకపోతే ఈ ఘటన తరువాత మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ… నేను ఇక్కడ అధికారంలో ఉన్నందువల్లే ఇంత సహనంగా ఉన్నానని, ఇక్కడ రిజర్వేషన్ల కోసం మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.