మూవీ రివ్యూ : “90ఎంఎల్”

తన మొదటి చిత్రం “ఆర్ఎక్స్ 100” తోనే యంగ్ హీరో కార్తికేయ అదిరిపోయే హిట్ ను సొంతం చేసుకున్నారు.అలాగే మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటుగా యువత నుంచి మంచి క్రేజ్ ఏర్పరచుకున్నాడు.అయితే ఇప్పుడు కార్తికేయ హీరోగా నేహా సోలంకి హీరోయిన్ గా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన “90ఎంఎల్” చిత్రం మంచి బజ్ నడుమ విడుదల అయ్యింది.మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే హీరో కార్తికేయ తాను పుట్టడమే ఒక ఆల్కాహాలిక్ డిజార్డర్ తో పుడతాడు.దీనితో అతనికి ఇంత మోతాదులో మద్యం అందించాలని డాక్టర్ చెప్పగా అలాగే పెరుగుతాడు.అయితే అలా పెరిగిన కార్తికేయ హీరోయిన్ నేహా సోలంకీతో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు.కానీ అక్కడ నుంచే అతనికి అసలు సమస్యలు మొదలుతాయి.అలా క్లైమాక్స్ లో ఒక సవాల్ ఎదుర్కొంటాడు.ఈ క్రమంలో విలన్ రవికిషన్ కు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?ఇలాంటి డిజార్డర్ వల్ల హీరో ఎలా తన సవాళ్ళను ఎదుర్కోగలిగాడు?క్లైమాక్స్ లో తన ముందుకొచ్చిన ఛాలెంజ్ ను అధిగమించాడా లేదా అన్న విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

మొదటగా కార్తికేయ కోసం మాట్లాడినట్టయితే కేవలం ఒక్క హీరోగానే కాకుండా ఎలాంటి రోల్ ఇచ్చినా సరే సమర్థవంతంగా ప్రెజెంట్ చెయ్యడంతో తాను బాగా నిలదొక్కుకున్నాడు.అదే విధంగా ఈ చిత్రంలో కూడా కార్తికేయ మంచి నటనతో ఆకట్టుకుంటాడు.ఆల్కాహాలిక్ డిజార్డర్ ఉన్న మనిషిగా మరోపక్క లవర్ బాయ్ గా, కొన్ని కామెడీ సీన్స్ లో టైమింగ్,ఎమోషనల్ ఎపిసోడ్స్ ముఖ్యంగా సాంగ్స్ లోని లుక్స్ పరంగా కానీ డాన్స్ పరంగా మంచి పెర్ఫామెన్స్ కనబరిచారు.అలాగే హీరోయిన్ నేహా సోలంకి కార్తికేయతో పోటీగా నటించింది.ఇద్దతి మధ్య కెమిస్ట్రీ సీన్స్ లో కానీ ఎమోషనల్ సీన్స్ లో కానీ మంచి నటన కనబర్చింది.

అంతేకాకుండా ఈ చిత్రంలోని మరో మెయిన్ రోల్ చేసిన రవి కిషన్ ఓ పక్క విలన్ గానే కాకుండా తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తాడు.రావు రమేష్,కమెడియన్ ఆలీ సహా మిగతా పాత్రదారులు తమ తమ పాత్రల పరిధికి మంచి నటన కనబర్చారు.ఇక దర్శకత్వంకు వచ్చినట్టయితే సినిమా దర్శకుడు శేఖర్ రెడ్డి మంచి ప్లాట్ లైన్ ఎన్నుకున్నారు.ఇలాంటి ప్లాట్ లైన్స్ ఇప్పటికే చాలా మంది ఎన్నుకున్న విభిన్నమైనవి కావడంతో కొత్తదనంలేకపోయినా దానిని ఎలా ఆవిష్కృతం చేశారు అన్నది మెయిన్ పాయింట్ గా నిలుస్తుంది.

దీనిని మొదటిలో బాగానే క్యారీ చేసారు.ముఖ్యంగా మంచి కామెడీ ట్రాక్స్ తో సినిమాను ఎక్కువగా నింపేశారు.వీటి వల్ల ఎంతైతే ఫన్ వస్తుందో అంతే స్థాయిలో కథ పక్కకు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది.ఈ విషయంలో దర్శకుడు బాలన్సుడ్ గా వ్యవహరించి ఉంటే బాగుండేది.అలాగే సెకండాఫ్ కు వచ్చేసరికి సినిమా నిడివి ఎక్కువయ్యినట్టుగా సాగదీతగా అనిపిస్తుంది.ఒక్కో సీన్ పరంగా బాగానే ఉన్నా ఎక్కడో లాజిక్ మిస్సయ్యినట్టుగా ప్రేక్షకులకి యిట్టె అర్ధం అయ్యిపోవచ్చు.

అయితే తన విలన్ రవికిషన్ కు మంచి కామెడీ ట్రాక్స్ రాసుకున్నారు.అవన్నీ సినిమాలో బాగా పేలాయి.కాకపోతే ముఖ్యంగా కామెడీ పైనే ఎక్కువ శ్రద్ధ చూపడం మూలానా సినిమా సోల్ దెబ్బ తింది.కాకపోతే ఓన్లీ కామెడీ కానీ వర్కౌట్ అయితే మంచి ఫలితం రావొచ్చు.కాకపోతే శేఖర్ రెడ్డి క్లైమాక్స్ ను తెరకెక్కించిన విధానం కాస్త విభిన్నంగా ఉంది.సినిమా పూర్తయ్యాక మాత్రం క్లైమాక్స్ కాస్త కొత్తగా ముగిసినట్టు అనిపిస్తుంది.కానీ ఎడిటింగ్ విషయంలో మాత్రం దర్శకుడు బాగా నిర్లక్ష్యం చేసేసారు.ఇక సంగీతం అందించిన అనూప్ చాలా కాలానికి మంచి లవ్ ఆల్బమ్,మాస్ బీట్స్,బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారని చెప్పొచ్చు.ఈ విషయంలో అనూప్ సినిమాకు మంచి బేస్ ఇచ్చారు.అలాగే జె యువరాజ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

కార్తికేయ పెర్ఫామెన్స్
కథానుసారం వచ్చే కామెడీ
విభిన్నమైన కథ

మైనస్ పాయింట్స్ :

ఎడిటింగ్
ఆల్కహాలిక్ సీన్స్ ఎక్కువ చూపించడం
సాగదీతగా ఉండే సెకండాఫ్

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే కార్తికేయ హీరోగా శేఖర్ రెడ్డి తెరకెక్కించిన “90ఎంఎల్” చిత్రం ఆకట్టుకునే కథాంశం బాగా నవ్వు తెప్పించే కామెడీ ట్రాక్స్ తో అలరిస్తుంది.అలాగే కార్తికేయ మంచి నటన కనబర్చారు.కానీ సీన్ల పరంగా ఒకే అనిపించినా ఓవరాల్ గా మాత్రం సినిమా అంతగా మెప్పించకపోవచ్చు.దర్శకుడు ఎడిటింగ్ పై ఎక్కువ శ్రద్ద తీసుకొని ఉంటే ఇంకా బెటర్ వెర్షన్ రాబట్టి ఉండొచ్చు.ఇవే కాస్త నిరాశపరుస్తాయి.మందు మోతాదు,కామెడీ మోతాదు ఎక్కువగానే ఉన్న ఈ సినిమా ఓవరాల్ గా ప్రేక్షకులకు ఎంత వరకు కిక్కిస్తుందో చూడాలి.

Rating: 2.5/5