మూవీ రివ్యూ : ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’.

సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన సినిమా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షుకుల అంచనాలను అందుకుందా లేదా అన్నది ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

జగన్ నాథ్ రెడ్డి (అజ్మల్ అమీర్) ఆర్.సీ.పీ పార్టీ.. బాబు వెలుగు దేశం పార్టీ పై సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ నాథ్ రెడ్డి పాలన విషయంలో తిరుగులేకుండా పరిపాలిస్తుంటాడు. అది చూసి బాబు ఓర్చుకోలేక బాధపడుతుంటాడు. దాంతో ఆర్.సీ.పీ నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో బాబును మాటల దాడితో హేళన చేస్తారు. ఆ అవమానభారంతో కుమిలిపోతున్న బాబును చూసి.. వెలుగు దేశం నాయకుడు దయనేని రమా, జగన్ నాథ్ రెడ్డి పై కుట్రలు పన్నుతాడు. కానీ ఆ క్రమంలోనే రమా అతి దారుణంగా హత్యకు గురవుతాడు. ఇంతకీ దయనేని రమాను హత్య చేయించింది జగన్ నాథ్ రెడ్డినా ? లేక బాబునా? ఆ తరువాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎవరు గెలిచారు? చివరికి దయనేని రమాని చంపిన వ్యక్తి దొరికారా? లేదా? ఈ మొత్తం కథలో పీపీ జాల్, మన సేన అధినేత ఎలాంటి పాత్రలను పోషించారు? అనేది మిగతా కథ.

 

విశ్లేషణ :

ప్రధానమైన రెండు పార్టీలు మరియు రెండు సామాజిక వర్గాల నడుమ రాజకీయ ఆధిపత్య పోరు కోసం సాగే ఈ రాజకీయ చిత్రంలో ప్రస్తుత రాజకీయ అంశాలను అలాగే అనేకమంది ప్రముఖుల పాత్రలను పోలిన పాత్రలను వ్యంగ్యంగా చూపిస్తూ కొన్ని చోట్ల దర్శక రచయితలు బాగానే నవ్వించారు. ముఖ్యమంత్రి పాత్రలో కనిపించిన అజ్మల్ అమీర్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ప్రత్యేకించి జగన్ బాడీ లాంగ్వేజ్ లోని ప్రధానమైన కొన్ని హావభావాలను, అజ్మల్ తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక బాబు పాత్రను పోషించిన నటుడు నటన పరంగా కంటే కూడా, అచ్చం బాబులానే కనిపిస్తూ మెప్పించాడు. స్పీకర్ గా అలీ, సిట్ ఆఫీసర్ గా కనిపించిన స్వప్న, సీబీఐ పాత్రలో నటించిన కత్తి మహేష్, అదేవిధంగా మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పీపీ జాల్ గా నటించిన నటుడు, మన సేన అధినేతగా మరియు చిన్నబాబుగా అనుకరించిన నటులు కూడా ఆయా ఒరిజినల్ పాత్రలను బాగా ఇమిటేట్ చేసి కొన్ని చోట్ల బాగా నవ్వించారు.

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకరచయితలు కొన్ని పేరడీ రాజకీయ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, కథాకథనాలను ఆకట్టుకునే విధంగా రాసుకోలేకపోయారు. ఇక జగదీశ్.సి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. అయితే కొన్ని చోట్ల ఉపయోగించిన స్టాక్ షాట్స్ ను రియల్ షాట్స్ లో కలిసిపోయేలా జాగ్రత్తలు తీసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. ఇక సంగీత దర్శకుడు రవి శంకర్ అందించిన సంగీతం బాగుంది. ఎడిటర్ అన్వర్ అలీ ఎడిటింగ్ జస్ట్ ఒకే అనిపిస్తోంది. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్లే ఉన్నాయి. మొత్తానికి వాస్తవిక పాత్రలకు కాల్పనిక సంఘటనలను జోడించి.. అవే సీన్లను అటు ఇటు తిప్పి వర్మ తీసిన ఈ సినిమా ఓ పార్టీ కార్యకర్తలకు మరియు ఓ వర్గం ప్రేక్షకులకు అయితే ఆనందాన్ని కలిగించొచ్చు కానీ.. మిగిలిన వర్గాల వారితో పాటు సగటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా రుచించదు. సినిమా నిండా తెలిసిన పాత్రలను పెట్టి వ్యంగ్యాన్ని విమర్శల ఫ్యాకేజిని మోతాదుకు మించి పెట్టినా.. అవి కూడా అక్కడక్కడా కొన్ని చోట్ల మాత్రమే నవ్వించగలిగాయి గాని.. సినిమాని మాత్రం నిలబెట్టలేకపోయాయి.

 

ప్లస్ పాయింట్స్ :

ప్రముఖుల పాత్రలను పోలిన పాత్రలు ఉండటం

కొన్ని కామెడీ సీన్స్

 

మైనస్ పాయింట్స్ :

ఇంట్రస్టింగ్ గా సాగని కథాకథనాలు

నవ్వించలేకపోయిన వ్యంగ్యం సీన్స్.

బోరింగ్ ట్రీట్మెంట్

సాగతీత సన్నివేశాలు

 

తీర్పు :

వివాదాస్పద సినిమాగా వచ్చిన ఈ సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, మెయిన్ ట్రీట్మెంట్ లోని కంటెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు ప్రీ క్లైమాక్స్ అండ్ సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే కొన్ని పేరడీ కామెడీ సీన్స్ మాత్రం నవ్విస్తాయి. కానీ మొత్తం మీద సినిమా మాత్రం బాగా స్లోగా సాగుతూ కనీస స్థాయిలో సగటు ప్రేక్షుకుడిని కూడా ఆకట్టుకోదు.

Rating : 2/5