మూవీ రివ్యూ : “అశ్వథ్థామ”

కొడితే ఈసారి హిట్టు కొట్టి తీరాల్సిందే అన్నట్టుగా హీరో నాగశౌర్య ఫిక్స్ అయ్యినట్టున్నారని చెప్పాలి.తాను హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ మరియు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “అశ్వథ్థామ”. తాను ఎంతో ఇష్టపడి రాసుకున్న కథ అని తప్పకుండా ప్రతీ ఒక్కరికీ నచ్చే తీరుతుంది అని చాలా నమ్మకంగా చెప్పారు.మరి ఈ చిత్రం ఆ నమ్మకాన్ని నిలబెట్టి తన కెరీర్ లో ఒక సాలిడ్ హిట్ ఇచ్చిందో లేదో ఇప్పుడు రివ్యూ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే ఊహించని రీతిలో కొంత మంది యువతులు మిస్సవుతూ హత్యలకు గురువుతుంటారు.ఇదే నేపథ్యంలో గణ(నాగశౌర్య) ఈ దారుణ ఘటనల గురించి తెలుసుకుంటాడు.వీటి మూలంగా గణ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు?అసలు ఈ దారుణ ఘటనల వెనుక ఉన్నది ఎవరు? వీటన్నిటికీ గల ప్రధాన కారణం ఏమిటి?అసలు ఈ కథకు ఎలాంటి ముగింపు వచ్చింది అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

2017లో వచ్చిన “ఛలో” తర్వాత మళ్ళీ తన కెరీర్ కు అంత బూస్టప్ ఇచ్చిన సినిమా ఇంకొకటి పడలేదు.అందుకే ఈసారి తానే తన రాతను మార్చుకునే ప్రయత్నం ఈ చిత్రం ద్వారా చేసారని చెప్పాలి.సినిమాకు అత్యంత కీలకమైన పార్ట్ “కథ”ను తానే అందించి ఈ సినిమాకు ప్రధాన ఎస్సెట్ గా మారారు.అయితే దీనికి సరైన ట్రీట్మెంట్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో పడలేదని చెప్పాలి.తాను రాసుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దానిని తెరకెక్కించే విధానం కాస్త నెమ్మదించింది అని చెప్పాలి.

అక్కడక్కడా స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగుతూ ఒక్కో దగ్గర బాగుండటం మూలాన ఫస్ట్ హాఫె పెద్దదిగా చూసే ప్రేక్షకుడికి అనిపించొచ్చు.కానీ తాను ఎంతగానో నమ్మిన కథ ప్రధాన బలం కావడం వల్ల దానికి అనుసంధానంగా వచ్చే ఎమోషన్స్ కానీ ట్విస్టులు కానీ ఈ జాన్రా చిత్రాలను ఇష్టపడే వారికి మంచి థ్రిల్ ను ఇస్తాయి.ఇలా ఫస్ట్ హాఫ్ మాత్రం జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది.ఇదే సమయంలో సెకండాఫ్ ఎంత కీలక పాత్ర పోషించనుందో అన్నది ఫస్ట్ హాఫ్ తెలియజేస్తూ అక్కడ నుంచి అసలు కథ మొదలవ్వనుంది అని చెప్తుంది.

అలా మొదలైన సెకండాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ కంటే కాస్త బెటర్ గా ఉంటుంది అని చెప్పాలి.మెయిన్ విలన్ ఎంట్రీతో పాటుగా సినిమా మెయిన్ థీమ్ లోకి ఇక్కడ నుంచే వెళ్తుంది.కథానుసారం వచ్చే ఎమోషన్స్ కానీ క్రైమ్ థ్రిల్లింగ్ సీన్స్ కానీ ఆకట్టుకుంటాయి.అయితే ఈ సినిమా ఒక క్రైమ్ మరియు యాక్షన్ థ్రిల్లర్ అనే కంటే మంచి ఒక మంచి ఎమోషనల్ చిత్రం అని కూడా చెప్పాలి.ఆడవాళ్లపై చూపే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి.అలాగే యాక్షన్ సీన్స్ ఈ చిత్రానికి మరో ఎస్సెట్ అని చెప్పాలి.

కానీ సెకండాఫ్ స్టార్టింగ్ నుంచి మొదలయిన ఆసక్తికర కథనం మరోసారి నెమ్మదించిన అనుభూతి కలుగుతుంది.ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే ఇన్నాళ్లు ఒక లవర్ బాయ్ లుక్ లో కనిపించిన నాగ శౌర్య ఈ చిత్రం ద్వారా తనలోని మాస్ యాంగిల్ అద్భుతంగా పోషించాడని చెప్పాలి.దీనికి “కేజీయఫ్” చిత్రానికి యాక్షన్ పార్ట్ ను అందించిన అన్బు – అరివు ల యాక్షన్ కొరియోగ్రఫీ మంచి ప్లస్ అయ్యింది.అలాగే శౌర్య చెల్లెలు పాత్రలో కనిపించిన నటి మంచి నటన కనబర్చింది.మెహ్రీన్ తన టాకీ వరకు ఒకే అని చెప్పొచ్చు.

ముఖ్యంగా విలన్ రోల్ లో కనిపించిన వ్యక్తి అయితే ఆ విలనిజంలో క్రూరత్వాన్ని మొహం చూపించకుండానే చూస్పిస్తాడు.అతనిపై వచ్చే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను ఇస్తాయని చెప్పాలి.ఇక దర్శకుడు రామ తేజ విషయానికి వస్తే మంచి కథను ఇచ్చిన నాగశౌర్యకు తన వంతుగా పూర్తి స్థాయి న్యాయం చేయలేకపోయారని చెప్పాలి.

ముఖ్యంగా స్క్రీన్ ప్లై అనుకున్నంత ఆసక్తికరంగా మలచలేకపోయారు.ఇదే ఈ చిత్రానికి ప్రధాన మైనస్ పాయింట్ అని చెప్పాలి.మిగతా అన్ని సన్నివేశాలు బాగానే తెరకెక్కించినా స్లో నరేషన్ మూలాన ప్రేక్షకుల్లో అంత ఇంపాక్ట్ కలగకపోవచ్చు.అలాగే శ్రీ చరణ్ పాకల అందించిన పాటలు ఒకే అనిపిస్తాయి.అయితే సినిమాకు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ స్పెషలిస్ట్ జిబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత బూస్టప్ ఇచ్చింది అని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

కాన్సెప్ట్

పలు ఆసక్తికర ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్ :

నెమ్మదిగా సాగే కథనం

సంగీతం

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే నాగశౌర్య ఎంతో ఇష్టపడి రాసుకున్న క్రైమ్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా “అశ్వథ్థామ” కాన్సెప్ట్ బాగున్నా దానిని తెరకెక్కించే విధానంలో దర్శకుడు రమణ తేజ విఫలం అయ్యారని చెప్పాలి.కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు పలు టెన్స్ సీన్స్ బాగానే ఉన్నా అంత ఆసక్తికరంగా సాగని కథనం మాత్రం పూర్తిగా సినిమా సోల్ ను దెబ్బ తీసింది.వీటి మూలాన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలిచిపోవచ్చు..

Rating: 2.5/5