మూవీ రివ్యూ : “ఎవరు”

టాలీవుడ్ లో అడవి శేష్ కు అంటూ ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.అతను తీసే సినిమాలు ఎంచుకునే సబ్జెక్టులతో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.ఒక “క్షణం” సినిమా అయితేనేం “గూఢచారి” సినిమా అయితేనేం ఆసక్తికరమైన సినిమాలను ఎంచుకుంటూ మాత్రం అడవి శేష్ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు.ఇప్పటి వరకు థ్రిల్లింగ్ జానర్ సబ్జెక్టులను ఎంచుకుని మరోసారి మళ్ళీ అలాంటి సబ్జెక్ట్ తోనే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా, రెజీనా కసాండ్ర ఒక కీలక పాత్రలో నటించిన “ఎవరు” ఈ రోజు ప్రీమియర్ షోగా పడింది.మరి ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే ఊహించని పరిస్థితుల్లో రెజీనా, నటుడు నవీన్ చంద్రను హత్య చేసి కేసులో ఇరుక్కుంటుంది.ఈ కేసును ఛేదించేందుకు కరెప్టెడ్ పోలీస్ అధికారి అయినటువంటి అడవి శేష్(విక్రమ్ వాసుదేవ్)రంగంలోకి దిగుతాడు.ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది.?ఈ నేపథ్యంలో శేష్ మరియు రెజినాల కథకు ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఆ హత్య ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? చివరకు రెజీనా ఈ కేసు నుంచి బయట పడిందా లేదా అన్న ఆసక్తికరమైన విషయాలను అన్ని తెలుసుకోవాలి అంటే ఈ సినిమాను ఖచ్చితంగా వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

అడవి శేష్ పై అంచనాలను పెట్టుకున్న ప్రేక్షకులను ఈ ఎవరు సినిమాతో మరోసారి అలరించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.సినిమా నిడివి చిన్నది కావడం వల్ల సినిమా ఆరంభం నుంచి ఆసక్తికరంగా కొనసాగుతుంది.కథానుసారం నడిచే సస్పెన్స్ అయితే సినిమా చూసే ప్రేక్షకుడిని మరింత కట్టిపడేస్తుంది.అలాగే మిస్టరీగా కొనసాగే మర్డర్ కేసుకు సంబంధించి చేసే ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్లు మరింత ఆసక్తికరంగా కొనసాగుతాయి.అలాగే అడవి శేష్ మరియు రెజీనాల మధ్య ఎపిసోడ్స్ కూడా బాగుంటాయి.కాకపోతే మొదటి సగంలో ఒక చోట సినిమా నెమ్మదిగా కొనసాగిన భావన కలుగుతుంది.

కానీ ఇంటర్వెల్ టైం లో వచ్చే ఒక ఊహించని ట్విస్ట్ మాత్రం సెకండాఫ్ లో ఏం జరుగుతుందా అని మరింత ఆసక్తిని పెంచేలా చేస్తుంది.ఫస్టాఫ్ ఎంత ఆసక్తికరంగా అయితే కొనసాగిందో సెకండాఫ్ కూడా అలాగే మొదలవుతుంది.అయితే అడవి శేష్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని వెళ్లేవారికి మాత్రం సెకండాఫ్ అంతగా రుచించకపోవచ్చు.సెకండాఫ్ మొదలైన చాలా సమయం వరకు శేష్ పాత్ర మళ్ళీ కనిపించదు.అందువల్ల శేష్ కంటే రెజీనా పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపిస్తుంది.

అలాగే హిందీ బద్లా మరియు ఇంగ్లీష్ వెర్షన్ లోని “ది ఇన్విసబుల్ గెస్ట్” చిత్రాలను చూసేసిన వారికి అయితే పెద్ద గొప్పగా అనిపించపోయినా మొదటి సారి చూసిన వారు అయితే మాత్రం ఖచ్చితంగా థ్రిల్ కు గురవుతారు.అయితే సెకండాఫ్ లో మాత్రం ఎక్కువ ట్విస్టులు చోటు చేసుకుంటూ కథనంను ఆసక్తికరంగా మలుస్తాయి.అంతే కాకుండా ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం అదిరిపోతాయి.

ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే అడవి శేష్ కంటే రెజీనా చుట్టూతానే ఈ సినిమా తిరుగుతుందని టీజర్ మరియు ట్రైలర్లు చూస్తేనే అర్ధం అవుతుంది.అందుకు తగ్గట్టుగానే రెజీనా మాత్రం అద్భుత నటనను కనబర్చారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.నటిగా రెజీనా ఈ చిత్రంతో మరో మెట్టు పైకి ఎక్కిందని చెప్పాలి.అలాగే అడవి శేష్ కూడా ఒక కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాల్లో ఎప్పటిలానే తనదైన నటన కనబరుస్తారు.ఇక ఇతర పాత్రల్లో కనిపించినటువంటి నవీన్ చంద్ర మరియు మురళీ శర్మలు మంచి నటనను కనబర్చారు.

ఇక దర్శకుని పనితనంకి వచ్చినట్టయితే దర్శకుడు వెంకట్ రామ్ జి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ చిత్రాన్ని చాలా చక్కగా హ్యాండిల్ చేసారని చెప్పాలి.ఫస్ట్ హాఫ్ లో ఒక్క చోట నెమ్మదించినా ఊహించని ట్విస్టులు అద్భుత స్క్రీన్ ప్లే తో సినిమా అంతటిని ఆద్యంతం ఆసక్తికరంగా మలచి వేస్తారు.దీనితో సినిమా చూసే ప్రేక్షకుడు ప్రతీ నిమిషం కూడా థ్రిల్ అవుతాడు.అలాగే వంశీ పచ్చి పులుసు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంటుంది.ఇక అలాగే సినిమాకు శ్రీచరణ్ పాకల తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోశారని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

అద్భుతమైన స్క్రీన్ ప్లే
ట్విస్టులు
రెజీనా మరియు శేష్ ల నటన
అద్భుతమైన క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ లో కాస్త సాగదీత
సెకండాఫ్ లో శేష్ పాత్రను తగ్గించడం

తీర్పు :

మొత్తానికి చూసుకున్నట్టయితే “ఎవరు” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.కథనంలో అసలు ఊహించని రేంజ్ ట్విస్టులు నువ్వా నేనా అన్నట్టుగా సాగే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మరియు క్లైమాక్స్ ఎపిసోడ్ హైలైట్ గా నిలవగా ఫస్ట్ హాఫ్ లో చిన్నగా నెమ్మదించడం ఇది వరకే బద్లా మరియు దీని ఇంగ్లీష్ వెర్షన్ కు పెద్దగా మార్పులు చెయ్యకపోవడం వంటివి నిరాశ పరిచినా ఓవరాల్ గా మాత్రం సినిమాను బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కించడంలో అయితే ఆపలేవని చెప్పి తీరాలి.

Rating: 3.5/5