మూవీ రివ్యూ : “ఇస్మార్ట్ శంకర్”

టాలీవుడ్ ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నభ నటేష్ మరియు నిధి అగర్వాల్ లు హీరోయిన్ లుగా పక్కా మాస్ మసాలా చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. గత కొంత కాలం నుంచి పూరికి సరైన హిట్టు బొమ్మ పడలేదు.ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్టు కొడతా అని పూరి శపథం కూడా చేసారు.ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు ట్రైలర్లకు మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి హైప్ వచ్చింది.మరి ఈ చిత్రంతో తాను అనుకున్న హిట్టు అందుకున్నారా లేదా అన్నది ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే ఒక సిబిఐ గ్యాంగ్ వారు నటుడు సత్యదేవ్ మెమొరీను ఉస్తాద్ శంకర్(రామ్) అనే ఓ హైదరాబాద్ కుర్రాడి తలలోకి ఓ మెడికల్ సర్జరీ ద్వారా మారుస్తారు.ఇదే నేపథ్యంలో మెదడుకు సంబంధించిన రీసెర్చర్ గా కనిపించే హీరోయిన్ నిధి తాను మరియు ఆమె బృందం బ్రెయిన్ లోని జ్ఞ్యాపక కణాలకు సంబంధించిన రీసెర్చ్ చేస్తుంటారు.అసలు ఆ సిబిఐ వారు రామ్ తలలోకి ఎవరివో బ్రెయిన్ లోని సమాచారాన్ని ఎందుకు ఎక్కించారు.?దీనికి నిధి రీసెర్చ్ కు ఉన్న సంబంధం ఏమిటి?ఈ రెండిటికి మధ్య ఏమన్నా సంబంధం ఉందా అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం మాస్ ప్రేక్షకులు మరియు ముఖ్యంగా యువత ఎక్కువగా ఎదురు చూసారు.కానీ ఈ సినిమా వారి అందరికి సరైన వినోదాన్ని పంచడంలో మొదటి నుంచి తడబట్టుగా అనిపిస్తుంది.సినిమా మొదట్లో కాస్త ఆసక్తికరంగానే ఉన్నట్టు అనిపించినా సరైన టేకింగ్ మరియు కథనం లేనట్టుగా సినిమా చూసే ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు.మధ్యలో వచ్చే ఓ ట్విస్ట్ మరియు మెదడులోని జ్ఞ్యాపకాలను మార్చడం వంటి అంశాలు కాస్త కొత్తగా అనిపించినా వాటిని సరిగ్గా ఎస్టెబిలిష్ చెయ్యడంలో పూరి విఫలం అయ్యారనే చెప్పాలి.అంతే కాకుండా రొటీన్ పోలీస్ మాఫియా కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి,ఈ సినిమా కూడా అలాగే ఉండడం ప్రేక్షకులను మరింత నిరుత్సాహ పరుస్తుంది.

అలాగే మొదటి సగం ముగిసే సరికే పొంతన లేని స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తుంది.అలాగే కొన్ని సన్నివేశాలు ముందే ఊహించేయగలగడం క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ముందు గానే ప్రేక్షకుడికి అర్ధం అయ్యిపోవడం వంటివి పూరి అభిమానులను కాస్త నిరాశ పరుస్తాయి.ఈ విషయాల్లో పూరి ఇంకా ఎక్కువ జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.ఇక అలాగే నటీనటుల విషయానికి వచ్చినట్టయితే ప్రతీ సినిమాలో ఒక సరికొత్త మేకోవర్ లో తన హీరోను చూపించడం పూరికి ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ,అందుకు తగ్గట్టుగా పక్కా హైదరాబాదీ యువకునిగా రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో మరియు తెలంగాణా యాసలో వన్ మేన్ షో చేసారని చెప్పాలి.

అంతేకాకుండా క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ లుక్ లో కూడా రామ్ అదరగొడతారు.అలాగే ఇద్దరు హీరోయిన్లు నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు.ఆ;అలాగే ఈ చిత్రంలో సత్యదేవ్ కు ఇచ్చిన ఓ కీలక పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేసారు.సినిమాలో మరో సహాయ నటుడు షియాజీ షిండే సినిమా చివరి వరకు సపోర్టింగ్ రోల్ లో ఆకట్టుకుంటారు.ఇక ఇతర టెక్నిషియన్స్ విషయానికి వచ్చినట్టయితే రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.ఇక సంగీత్ దర్శకుడు మణిశర్మ కోసం చెప్పుకొనే తీరాలి.మణి ఇచ్చే పాటలకు వేరేగా ఆయనిచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు వేరేగా అభిమానులు ఉంటారు.ఈ చిత్రంతో ఒక రెండు పాటలు పర్వాలేదనిపించినా మిగతా పాటలు సహా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతాయి.

ప్లస్ పాయింట్స్ :

రామ్ వన్ మేన్ షో
పాటలు మరియు మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

కథ
బోరింగ్ స్క్రీన్ ప్లే
ఏమాత్రం కొత్తదనం లేని కథనం

తీర్పు :

ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే రామ్ మరియు పూరీలా కాంబినేషన్ లో వచ్చిన మొదటి రొటీన్ కమర్షియల్ డ్రామా “ఇస్మార్ట్ శంకర్” ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యిందా అంటే లేదనే చెప్పాలి.ఒక్క రామ్ నటన,అతని మేకోవర్ మరియు మణిశర్మ పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ హైలైట్ అవ్వగా ఏమాత్రం ఆకట్టుకోలేని కథ,కథనం ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తాయి.ఓవరాల్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలవొచ్చు.

Rating: 2.5/5