మూవీ రివ్యూ : “జెర్సీ”

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా “మళ్ళీరావా” వంటి డీసెంట్ హిట్ ను అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ “జెర్సీ”.ముందు నుంచి డిఫరెంట్ కథాంశాలను ఎంచుకుంటున్న నాని ఈసారి కూడా అలాంటి స్టోరీ తోనే ముందుకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ట్రైలర్ తోనే మంచి స్పందనను అందుకున్న ఈ చిత్రం ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే నాని(అర్జున్) తన వివాహ జీవితం అనంతరం అప్పుడు ఎదురయ్యే సమస్యలు వలన తన క్రికెట్ జీవితాన్ని ఆపేస్తాడు.కానీ మళ్ళీ పదేళ్ల తర్వాత తాను కోల్పోయిన లక్ష్యాన్ని మళ్ళీ అందుకోవాలని ఆశిస్తాడు.ఆ నేపథ్యంలో అర్జున్ ఎదుర్కున్న పరిణామాలు ఏమిటి? భారత జట్టుకు ఎంపిక కావాలనే తన ప్రయత్నం ఫలించిందా?ఈ విధంగా అర్జున్ జీవితం ఎమోషనల్ గా ఎలా సాగిందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

“మళ్ళీరావా” లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందించిన గౌతమ్ తిన్ననూరి తన తర్వాత సినిమా నాచురల్ స్టార్ నానితో అందులోను క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని తెలీగానే మంచి ఆసక్తి రేకెత్తింది.అందుకు తగ్గట్టుగానే గౌతమ్ కూడా ఈ చిత్రాన్ని చాలా డీసెంట్ గా తెరకెక్కించారు.నాని నటనా చాతుర్యానికి తగ్గట్టుగా నాని నుంచి మంచి ఎమోషన్ ను రాబట్టారు.అలాగే 1986 మరియు 1990లలో ఉండే వ్యత్యాసాలను చక్కగా క్యారీ చేసారు. అయితే సినిమా నిడివి కాస్త పెద్దది కావడం వలన ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీతగా సాగిన అనుభవం చూసే ప్రేక్షకుడికి కలుగుతుంది.ఈ విషయంలో గౌతమ్ కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.ఇది మినహాయిస్తే గౌతమ్ పెట్టిన ఎఫర్ట్ హర్షించదగినదే.

ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే తన సహజ నటనతో నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని తన కెరీర్ లో బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఈ సినిమాకి ఇచ్చారని చెప్పడంలో ఏమాత్రం అతిశెయోక్తి లేదు.ముఖ్యంగా తన కొడుకు విషయంలో మరియు ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో నాని కనబర్చే సహజ నటన సినిమా చూసే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.రెండు షేడ్స్ లో కనిపించిన నాని నటన కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

ఇక అలాగే నాని సరసన నటించిన శ్రద్ధా దాస్ ఇది వరకే కోలీవుడ్ లో తానేంటో నిరూపించుకున్నారు.అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో నానికి ఏమాత్రం తగ్గకుండా మంచి నటన కనబర్చారు.అలాగే నాని కొడుకుగా నటించిన రోహిత్ కమ్రా,సత్య రాజ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం అందించారు.అలాగే షను అందించిన సినిమాటోగ్రఫీ సహజంగా ఉంటుంది.ఇక సంగీత దర్శకుడు అనిరుద్ విషయానికి వస్తే ఎన్నో సినిమాలకు మంచి సంగీతం అందించిన అనిరుద్ ఈ సినిమాకి కూడా మంచి సంగీతాన్ని అందించారు.ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ కు తగ్గట్టుగా ఇవ్వడంతో సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ఉన్న ఎమోషనల్ కంటెంట్
నాని అద్భుత నటన
ఆసక్తికరంగా సాగే ఫస్టాఫ్
బాక్గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

సినిమా నిడివి
అక్కడక్కడా కొంచెం సాగదీత

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే అర్జున్ అనే క్రికెటర్ యొక్క ఎమోషనల్ ప్రయాణమే ఈ జెర్సీ.నాని కనబర్చిన అద్భుత నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా అక్కడక్కడా స్లో నరేషన్ మైనస్ అని చెప్పొచ్చు.మాస్ ఆడియెన్స్ కు ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వకపోయినా ఫ్యామిలి మరియు క్లాస్ ఆడియెన్స్ కు మాత్రం ఖచ్చితంగా నచ్చే సినిమాగా నిలుస్తుంది.అందుకని ఈ వారాంతంలో ఈ సినిమాను ఖచ్చితంగా చూడొచ్చు.

Rating : 3.5/5