మూవీ రివ్యూ: కాంచన 3

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వేదిక, ఓవియా ముఖ్య పాత్రల్లో ముని సిరీస్ లో భాగంగా హారర్ కామిక్ థ్రిల్లర్ గా వచ్చిన కాంచన 3. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

కాళీ (రాఘవ లారెన్స్) తన తల్లి ప్రభావంతో తన జీవితాన్ని ఎదుటివారి కోసమే తాగ్యం చేస్తూ… అంగ వైకల్యం కలిగిన పిల్లల కోసం ఓ ఆశ్రమం నడుపుతుంటాడు. అయితే మినిష్టర్ శంకర్, అతని తమ్ముడు కాళీ ద్వారా ఎనభై కోట్ల డబ్బును సంపాదించాలని ప్లాన్ చేస్తారు. దానికి కాళీ అంగీకరించడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కాళీ చనిపోయి దెయ్యం అయి రాఘవ (రాఘవ లారెన్స్) మీద ఆవహిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల తరువాత కాళీ ఎవరి మీద తన పగను తీర్చుకున్నాడు ? ఎలా తీర్చుకున్నాడు ? చివరికీ రాఘవను కాళీ వదిలేశాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

రాఘవ లారెన్స్ ముని సిరీస్ లో భాగంగా వరుసగా సీక్వెల్స్ తీస్తూ హిట్స్ కొడుతున్నాడు. కామెడీ, భయం లాంటి అంశాలతో అల్లుకొని రాసుకున్న సీన్స్ తోనే ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. ఇటు ఎంటర్టైన్మెంట్ తో పాటు అటు భయాన్ని, ఎమోషన్ని కూడా లారెన్స్ బాగానే పండించాడు. అలాగే ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ రాఘవ లారెన్స్ నటనే హైలైట్ గా నిలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన వేదిక, ఓవియా కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, కొన్ని హర్రర్ సన్నివేశాల్లో కూడా తమ పెర్ఫార్మెన్స్ తో మెప్పించారు. అలాగే తల్లి పాత్రలో నటించిన కోవై సరళ కూడా ఎప్పటిలాగే తనదైన శైలిలో అద్భుతంగా నటించింది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక దర్శకుడిగా రాఘవ లారెన్స్ హర్రర్ అండ్ కామెడీ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ తో ప్రేక్షకులని నవ్విస్తాడు. అలాగే ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్నాడు. ఆయితే సినిమాలో చాలానే బలహీనతలు ఉన్నాయి. ముఖ్యంగా కథనంలో కొన్ని సీక్వెన్స్ లో ప్లో మిస్ అయింది. ఏ సీన్ కి ఆ సీన్ బాగుందినిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. పైగా కాంచన 1, 2 పార్ట్స్ లో ఫాలో అయిన స్క్రీన్ ప్లే ఫార్మాట్ నే కాంచన 3లో కూడా ఫాలో అయ్యారు. దాంతో కొన్ని సీన్స్ ఇంతకు ముందు చూసినవే కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికి తోడు అక్కడక్కడ తమిళ్ నేటివిటీ సినిమాలో ఎక్కువుగా కనిపిస్తోంది.

ప్లస్ పాయింట్స్ :

రాఘవ లారెన్స్ అద్భుతమైన నటన

ఎమోషనల్ గా నడిచే ఫ్లాష్ బ్యాక్

కొన్ని హార్రర్ అండ్ కామెడీ సీన్స్

లారెన్స్ దర్శకత్వ పనితనం

మైనస్ పాయింట్స్ :

కథనం

కామెడీ మరియు హర్రర్ ఎలిమెంట్స్ రొటీన్ గా సాగడం

అక్కడక్కడా స్లోగా నడిచే సన్నివేశాలు

నటీనటుల ఓవర్ యాక్షన్

తీర్పు :

ముని సిరీస్ లో భాగంగా ‘కాంచన’ సినిమాలకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం పక్కా మాస్ అంశాలతో సాగుతుంది. మెయిన్ గా బి,సి సెంటర్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంది. ఇక రాఘవ లారెన్స్ నటన, కామెడీ సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. చివరగా ఈ చిత్రం మాస్ ప్రేక్షకులు ఆకట్టుకునేలా వుందని చెప్పొచ్చు.

 

Rating : 3/5

REVIEW OVERVIEW
Kanchana 3 Movie Review