మూవీ రివ్యూ : కనులు కనులను దోచాయంటే…

దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా దర్శకుడు దేసింగ్ పెరియస్వామి తెరక్కించిన చిత్రం కనులు కనులను దోచాయంటే. ఈ చిత్రం నేడు తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైంది.మరి ఈ చిత్రం ప్రేక్షకుల మనసులు ఎంత వరకు దోచుకుందో చూద్దాం…

కథ :
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన సిద్దార్థ(దుల్కర్ ), కలీస్(రక్షణ్) ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారా డబ్బులు సంపాదిస్తూ హ్యాపీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. వరుసగా జరుగుతున్న ఈ మోసాల వెనుక ఎవరున్నారు అని పోలీస్ ఆఫీర్ ప్రతాప్ సింహ(గౌతమ్ మీనన్) ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఓ పెద్ద దొంగతనం తరువాత సిధార్థ, కలీస్ తాము ప్రేమించిన మీరా (రీతూ వర్మ) సూర్య కాంతం(నిరంజని) తో కలిసి గోవా వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలని ప్లాన్ వేస్తారు. గోవాలో ప్రతాప్ వీరిని పట్టుకుంటాడు. మరి పోలీసుల చేతికి చిక్కిన వీరిద్దరూ తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వీరితో గోవా వచ్చిన మీరా ఆమె స్నేహితురాలు ఏమైయ్యారు.? చివరికి ఈ జంటల కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.

విశ్లేషణ :

కనులు కనులను దోచాయంటే మూవీ చాలా వరకు ఆసక్తిగా సాగే రొమాంటిక్ క్రైమ్ డ్రామా.దర్శకుడు ఈ కాలంలో జరుగుతున్న అనేక రకాల చీటింగ్స్ లో కొన్నిటిని ప్రస్తావిస్తూ కథను నడిపిన విధానం బాగుంది. ఆయన తీసుకున్న పాయింట్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది.

మొదటి సగం సినిమా ఎక్కడా నెమ్మదించని స్క్రీన్ ప్లే, హీరో హీరోయిన్ డీసెంట్ లవ్ ట్రాక్ మరియు హీరో చీటింగ్ టెక్నిక్స్ కి సంబంధించిన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటది.

ఇంటెలిజెంట్ దొంగగా దుల్కర్ సల్మాన్ నటన పాత్రకు తగ్గట్టుగా సాగింది. ఆయన ఈ మూవీలో చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నారు. హీరో ఫ్రెండ్ పాత్ర చేసిన రక్షణ్ హీరో పాత్రకు సహాయకుడిగా మరియు ప్రేక్షకులకు కామెడీ పంచే బాధ్యత తీసుకొని చాలా వరకు సక్సెస్ అయ్యారు.
రెండు భిన్న షేడ్స్ కలిగిన పాత్రలో రీతూ వర్మ నటన మెప్పించింది. పోలీస్ అధికారిగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక ఈ చిత్రం చీటింగ్ సన్నివేశాలు క్రైమ్ లాజిక్స్ చాలా వరకు వాస్తవానికి దగ్గరగా సాగినప్పటికీ, సెకండ్ హాఫ్ లో కథనం కొంత సేపు నెమ్మదించింది. ఇంటెలిజెంట్ హీరో ఇద్దరు ఆడవాళ్ళ చేతిలో మోసపోవడం నమ్మబుద్ది కాదు.

హీరో హీరోయిన్స్ కోసం సీరియస్ గా వెతుకుతున్న పోలీస్ అధికారిగా గౌతమ్ మీనన్ పాత్రను ఫస్ట్ హాఫ్ లో ఓ రేంజ్ లో ఎలివేట్ చేసి సెకండ్ హాఫ్ లో ఏమీ ప్రాధాన్యం లేకుండా, క్లైమాక్స్ లో సిల్లీగా ముగించారు.

క్లైమాక్స్ సైతం ఇంకొంచెం ఆసక్తికరంగా మలిచివుంటే సినిమా చాలా బాగుండేది. ఇక టైటిల్ చూసి ఇది పక్కా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకుంటే పొరపాటే.

ప్లస్ పాయింట్స్ :

కథ, కథనాలు
నటులు
కెమెరా వర్క్
బీజీఎమ్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హ్లాఫ్ బిగినింగ్
క్లైమాక్స్
గౌతమ్ మీనన్ రోల్ ముగింపు

తీర్పు :

లవ్ అండ్ క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం చాలా వరకు ఆకట్టుకుంటుంది. సమకాలీన హైటెక్ మోసాలను ప్రస్తావిస్తూ లవ్ ఎమోషన్స్ ని మిక్స్ చేసి తీసిన ఈ చిత్రం కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా, సిట్యువేషనల్ కామెడీ మరియు సీరియస్ క్రైమ్ తో సాగిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరచదు. కాకపోతే సెకండ్ హాఫ్ ప్రారంభ సన్నివేశాలు, క్లైమాక్స్ ఇంకా ఆసక్తికరంగా రాసుకొని ఉంటే మూవీ మరో స్థాయిలో ఉండేది.

Rating : 3/5