మూవీ రివ్యూ : మహర్షి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 25 వ సినిమా “మహర్షి”.వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్ ఒక ప్రముఖ పాత్ర పోషించారు.మూడు విభిన్న షేడ్స్ లో మంచి సందేశాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.అన్ని అంచనాల నడుమ ఈ చిత్రం ఈరోజే విడుదలైంది.మరి మహేష్ – వంశీల జర్నీ ఆ అంచనాలను అందుకుందా లేదా అన్నది ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే హీరో మహేష్ బాబు (రిషి) తన కాలేజ్ రోజుల నుంచే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అన్న ఒక ధృడ సంకల్పంతో ఉంటాడు.అదే సమయంలో “అల్లరి” నరేష్(రవి) మరియు పూజా హెగ్డేలు పరిచయమయ్యి మంచి స్నేహితులుగా మారుతారు.ఆ తర్వాత కథానుసారం రిషి ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ స్థాయి నుంచి రైతుగా ఎందుకు మారాల్సి వస్తుంది.?ఈ క్రమంలో రవి పాత్ర వెనుకున్న కీలక అంశం ఏమిటి? తాను అనుకున్న నిజమైన సక్సెస్ కు నిర్వచనం తెలుసుకున్నాడా? ఈ నేపథ్యంలో రిషి జర్నీ ఎమోషనల్ ఎంత వరకు కనెక్ట్ అయ్యిందో తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై తప్పక చూడాల్సిందే.

విశ్లేషణ :

మహేష్ బాబు నటిస్తున్న 25 వ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు వాటంతట అవే పెరిగిపోయాయి.దర్శకుడు వంశీ రెండేళ్లు మహేష్ కోసం ఎందుకు నిరీక్షించారో ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది.సినిమా నిడివి పెద్దది కావడంతో ప్రేక్షకుల్లో అసలు వంశీ ఎలా క్యారీ చేస్తారో అన్న సందేహం కలిగింది.కానీ వాటన్నిటికీ అతీతంగా వంశీ చక్కగా నరేషన్ ను బ్యాలన్సుడ్ గా నడుపుకొచ్చారు.ఇక అలాగే ఈ సినిమా కాన్సెప్ట్ మరియు మహేష్ షేడ్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రతీ ఒక్కరిలోను ఇదే ఆసక్తికరంగా మారిన అంశం దీన్ని వెండి తెరపై చక్కగా ప్రెసెన్స్ చేయడంలో కూడా వంశీ మంచి మార్కులే కొట్టేసారు.

ఇక అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే పాటలు కామెడీ సీన్స్ అలాగే “సక్సెస్ ఈజ్ ఏ జర్నీ” అంటూ మహేష్ ఇచ్చే స్పీచ్ మరియు ఫైట్ సీన్లు ఇంటర్వెల్లో చోటు చేసుకునే ట్విస్ట్ ప్రధాన ఆకర్షణగా నిలిచి సెకండాఫ్ పై మరింత ఆసక్తిని రేపుతాయి.ఇక సెకండాఫ్ విషయానికి వస్తే మాస్ ఎలివేటెడ్ సీన్లు అలాగే మూడో ముఖ్య పాత్రలో మహేష్ కనిపించిన సీన్లు మరియు ఎమోషనల్ క్లైమాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువ కావడం వల్ల ప్రతీ నిమిషం కీలకమే,దాని వల్ల ప్రేక్షకుడు ఆ ప్రతీ నిమిషాన్ని ఆస్వాదించాలని కోరుకుంటాడు.కానీ అది అక్కడక్కడా ఈ చిత్రంలో మిస్సవుతున్న భావన కలుగుతుంది.ఈ విషయంలో వంశీ మరింత జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.ఈ చిత్రంలో పూజా పాత్రకు కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చినట్టు కనిపించదు.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఇప్పటి వరకు మహేష్ కనిపించిన 24 సినిమాలు ఒకెత్తు ఈ 25వ సినిమా ఒకెత్తు అని చెప్పాలి.మొట్ట మొదటిసారి మహేష్ గడ్డం లుక్ లో కనిపించడం మహేష్ అభిమానులకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే మహేష్ కాలేజ్ లైఫ్ స్టైల్ ని చూస్తే మనకి వింటేజ్ మహి గుర్తు రాక మానడు ఇది మాత్రం అభిమానులకు పండగే అని చెప్పాలి.ఒక స్టైలిష్ బిజినెస్ మేన్ గా స్టూడెంట్ గా రైతుగా మూడు షేడ్స్ లో మహేష్ అద్భుత నటన కనబర్చారు.అలాగే “అల్లరి” నరేష్ పాత్ర ముందు నుంచి హైలైట్ గానే వస్తుంది.అందుకు తగ్గట్టుగానే నరేష్ తన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చారు..

హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో మంచి నటనను కనబర్చారు.కార్పొరేట్ విలన్ గా జగపతిబాబు తనలోని విలనిజాన్ని మరో సారి చూపించారు.అలాగే ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.అలాగే కే యూ మోహనన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా కనిపిస్తుంది.దేవిశ్రీ ఈ సినిమాకు అందించిన పాటలు ముఖ్యంగా ఎమోషనల్ గా ఇచ్చిన రెండు పాటలు బాగున్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఊహించిన స్థాయిలో ఇవ్వలేదు.ఈ విషయంలో దేవిశ్రీ కాస్త నిరాశపరిచాడు.

ప్లస్ పాయింట్స్ :

మహేష్ అద్భుత నటన
కాలేజ్ ఎపిసోడ్స్
క్లైమాక్స్
సెకండాఫ్ లో మహేష్ ఎలివేషన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడా డల్ అనిపించే నరేషన్
నిడివి
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్

తీర్పు :

ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ మహర్షి ప్రయాణం బాగానే సాగిందని చెప్పాలి.మహేష్ బాబు అద్భుత నటన అలాగే సెకండాఫ్ లో మాస్ ఎలివేషన్ సీన్స్ ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా..నిడివి కాస్త పెద్దది కావడం వల్ల అక్కడక్కడా స్లో అవ్వడం కాస్త మైనస్ అని చెప్పొచ్చు.ముఖ్యంగా రైతులను ఉద్దేశించి మంచి సందేశాన్ని ఇవ్వడంలో వంశీ టీమ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.ఓవరాల్ గా చూసుకున్నట్లతే మహేష్ అభిమానులకు “మహర్షి” ఒక ట్రీట్ గా నిలవడమే కాకుండా ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.

Rating : 3.5/5