మూవీ రివ్యూ : మజిలీ

గత కొంత కాలం నుంచి అక్కినేని వారసుడు యువసామ్రాట్ నాగ చైతన్యకు సరైన హిట్ తగల్లేదనే చెప్పాలి.ఎప్పుడు పాత్రకి తగ్గట్టు తనని తాను సరికొత్తగా మలచుకుంటూ డిఫరెంట్ కాన్సెప్టులతో పాటు ఎంటెర్టైన్మెంట్ జానర్ లు కూడా ట్రై చేసినా అవి చైతూని ప్లాప్ ల నుంచి కాపాడలేకపోయాయి.దేనితో ఈ సారి మాత్రం అక్కినేని అభిమానులను నిరాశపరచకూడదని “నిన్నుకోరి” లాంటి మంచి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో “మజిలీ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో చైతు మరియు సమంతా మరోసారి జత కట్టారు.ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది.మరి ఈ సినిమా అంచనాలను ఎంత వరకు అందుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే పూర్ణ(నాగచైతన్య) క్రికెట్ అంటే ఎంతో ఇష్టమైన టీనేజ్ కుర్రాడిగా ఉన్నపుడు అన్షు(దివ్యాన్ష కౌశిక్)తో పెరిగిన పరిచయం ప్రేమగా మారుతుంది.కానీ అనుకోని పరిణామాల వల్ల ఈ ఇద్దరు వారి తల్లిదండ్రుల వల్ల విడిపోతారు.దానితో చైతు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు.ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఒత్తిడి వలన శ్రావణి(సమంత)ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.డిప్రెషన్ లో ఉన్న పూర్ణతో శ్రావణి తన జీవితాన్ని ఎలా గడిపింది.ఆ నేపథ్యంలో వీరిద్దరి మధ్య బంధం ఎమోషనల్ గా ఎలా సాగింది? పూర్ణ చివరకి మాములు మనిషిగా మారాడా లేదా అన్నది తెలియాలంటే ఈ సినిమాను వెండి తెరపై ఖచ్చితంగా చూడాల్సిందే.

విశ్లేషణ :

“నిన్నుకోరి” లాంటి మంచి ఫీల్ గుడ్ చిత్రాన్ని అందించిన శివ నిర్యాణ నుంచి వస్తున్న రెండో సినిమా కావడం వలన ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి.సినిమా మొదలు అయ్యినప్పటి నుంచి పర్వాలేదనిపించే స్థాయి నుంచి మెల్ల మెల్లగా ఆసక్తికరంగా నరేషన్ సాగుతున్న అనుభూతి అయితే ఫస్ట్ హాఫ్ చూసే ప్రేక్షకుడికి అనిపిస్తుంది.ఇక్కడ శివ బాగా బ్యాలెన్స్ చేశారనే చెప్పాలి.అలాగే ఫస్టాఫ్ లో చైతు మరియు అన్షు ల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్లు మరియు పాటలు ఆకట్టుకుంటాయి.అలాగే సినిమా సగానికి పూర్తయ్యే సరికి సరిగ్గా సమంత పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచడంతో పాటు అక్కడ నుంచి సమంత పాత్ర కీలకంగా మారుతుందన్న భావన హైలైట్ గా నిలుస్తుంది.

ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి సమంత పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో సెకండాఫ్ పై మంచి అంచనాలు ఏర్పడతాయి.సెకండాఫ్ లో చైతు మరియు సమంతల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగుంటాయి.కాకపోతే ఒకే ఫ్లో అయితే సెకండాఫ్ మొదటి నుంచి కొనసాగినట్టు అనిపించదు.అందువల్ల సినిమాపై ప్రేక్షకుడికి కాస్త ఆసక్తి తగ్గొచ్చు.అలాగే కథానుగుణంగా చోటు చేసుకునే చిన్న ట్విస్ట్,డిప్రెషన్ లోకి వెళ్లిన చైతూని తిరిగి మార్చడానికి ప్రయత్నించే అంశాలు ఆ నేపథ్యంలో సమంత నటన ఆకట్టుకుంటాయి.ఇక అలాగే చై మరియు సామ్ ల మధ్య సాగే ఎమోషనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ సెకండాఫ్ అంతటికీ ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు.

ఇక నటీనటుల విషయానికి వస్తే నాగ చైతన్య సినీ కెరీర్ ని గమనించినట్లయితే రొటీన్ కథాంశాలను కాకుండా ఫలితాన్ని పక్కన పెడితే కాస్త భిన్నమైన కథలను ఎంచుకోవడం వాటికి తగ్గట్టుగా తనని తాను ఆవిష్కరించుకోవడం మనం గమనించవచ్చు.అలాగే ఈ సినిమాలో చైతు కనిపిస్తాడు.ఒక టీనేజ్ వయసులో క్రికెటర్ గా అలాగే మధ్య వయసులో క్రికెట్ కోచ్ గా చైతు తన నటనతో ఎప్పటిలానే అదరగొట్టేసాడు.అలాగే తన పరిధి మేరకు ఉన్న అన్షు పాత్రకు దివ్యాన్ష పూర్తి న్యాయం చేకూర్చింది.చై మరియు సమంతల మధ్య వచ్చే వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో వీరి నటన సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్తుంది.ఇక సమంత నటన కోసం కూడా వేరే చెప్పక్కర్లేదు చైతు పాత్రలానే సామ్ కు కూడా ఇందులో రెండు షేడ్స్ ఉన్నాయి.వాటికి తగ్గట్టుగా సామ్ చాలా చక్కగా ఒక యువతిగా అలాగే బాధ్యత గల భార్యగా అద్భుత నటనను కనబర్చారు.మిగతా పాత్రల్లో కనిపించిన సుబ్బరాజ్ పోసాని తదితరులు వారి పాత్రలకు న్యాయం చేకూర్చారు.

ఇక దర్శకుని పనితీరు గమనించినట్లయితే శివ నిర్యాణ రాసుకున్న పాత్రలను వెండితెరపై బాగానే ప్రెజెంట్ చేసారని చెప్పొచ్చు.అలాగే సినిమా ఫస్ట్ హాఫ్ లో సాదా సీదాగా సాగుతుందన్న సమయంలో కాస్త ఆసక్తికరంగా కథనాన్ని మార్చడంలో బ్యాలన్సుడ్ గా నడిపిస్తారు.కానీ అది సెకండాఫ్ కి విషయంలో అంతగా వర్కౌట్ అయ్యినట్టు అనిపించదు.సినిమాకి ఎంతో బలమనుకున్న సమంత పాత్రకున్న ప్రాముఖ్యత మెల్లగా ఫేడ్ అవుట్ అవుతున్నట్టు అనిపించడం వలన సినిమా గాడి తప్పుతున్నట్టు అనిపిస్తుంది.ఈ విషయంలో శివ ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.ఇక సంగీతం విషయానికి వస్తే గోపి సుందర్ అందించిన ఆరు పాటలు ఒకే అనిపిస్తాయి.అలాగే థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి బాగా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.అలాగే కొన్ని పాటల్లో విష్ణు శర్మ ఫోటోగ్రఫి బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

బ్యాక్గ్రౌండ్ స్కోర్,పాటలు
ఇంటర్వెల్ బ్లాక్
సమంత పాత్ర
సినెమాటోగ్రపీ

మైనస్ పాయింట్స్ :

ఎమోషనల్ గా సాగే కొన్ని కీలక సన్నివేశాల్లో కనిపించే లోపాలు
సెకండాఫ్ లో కాస్త సాగదీత

తీర్పు :

ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే పూర్ణ అనే వ్యక్తికి సంబందించిన ఒక విషాద గాథే ఈ “మజిలీ” సినిమా.భార్యా భర్తల మధ్య ఉండే బంధంకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? వివాహ జీవితంలో వారిద్దరికీ మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండాలో అన్న విషయాన్ని ఇప్పుడున్న తరానికి మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాగా దీన్ని చెప్పొచ్చు.శివ ఎంచుకున్న స్టోరీ లైన్ మంచిదే అయినా దాన్ని ఇంకాస్త మెరుగ్గా ఆవిష్కరించి ఉంటే బాగుండేది.ఈ పండుగ సీజన్లో ఈ సినిమాను కుటుంబంతో కలిసి ఒకసారి చూడొచ్చు.

Rating :3/5