రివ్యూ : ‘మత్తు వదలరా’

సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. కాగా రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమాకి కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రోజు ప్రివ్యూ వేశారు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

బాబు మోహన్ (శ్రీ సింహా) ఊరు నుంచి వచ్చి చాలీచాలని జీతంతో ఇబ్బంది పడే ఒక డెలివరీ బాయ్. తన స్నేహితులతో ఒక రూమ్ లో నివసిస్తూ డబ్బులు కోసం ఇబ్బంది పడుతుంటాడు. స్నేహితుడు ఏసు (సత్య) వల్ల చాలా తెలివిగా డెలివరీ ఇస్తూ తన వినియోగదారులను మోసి చేసి డబ్బు సంపాధించాలని నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో ఒక ఫ్లాట్‌కు వెళ్తాడు. కానీ అక్కడ అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలతో ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని.. ఆ కేసు నుండి తప్పించుకోవడానికి ఏం చేశాడు అనేదే మిగతా కథ. ఇంతకీ బాబు మోహన్ క్రైమ్ లో ఎలా చిక్కుకుంటాడు.. ? అతను తిరిగి ఆ కేసు నుండి ఎలా బయట పడతాడు ? ఈ మధ్యలో అతను ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ సినిమాలో పాటలు, హీరోయిన్, రొమాన్స్ లేకున్నా దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్ కామెడీని డీల్ చేసిన విధానం బాగా ఆకట్టుకుంది. మొదటి మూవీ అయినా కూడా దర్శకుడురితేష్ ఎంచుకున్న కథను చెప్పిన విధానం చాలా బాగుంది. వాస్తవికతకు కాస్త దూరంగా అనిపించినా ఆయన స్క్రీన్ ప్లే మాత్రం ప్రేక్షకుడికి ఉత్కంఠను కలిగిస్తూనే బాగా నవ్విస్తోంది. మొత్తానికి రితేష్ ఇటు హాస్యాన్ని అటు సీరియస్ నెస్ ని మిక్స్ చేసి సినిమాని బాగా హ్యాండిల్ చేశాడు. ఇక హీరో శ్రీసింహా చాల బాగా నటించాడు. ఊరు నుండి వచ్చి చాలీచాలని జీతంతో ఇబ్బంది పడే ఒక డెలివరీ బాయ్ గా చాల సహజంగా నటించాడు. అలాగే ఒక మర్డర్ కేసు లో ఇరుకునే సన్నివేశాల్లో కూడా చాల సెటిల్డ్ గా నటించాడు.

ఇక కమెడియన్ సత్య తన కామెడీతో ఈ సినిమాకి ఊపిరి పోసాడు. సినిమా మొత్తం తన భుజాల పై మోసాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో చక్కగా పర్ ఫామ్ చేసాడు . అతని డైలాగ్ డిక్షన్ కూడా సినిమాకు చక్కగా ఉపయోగపడింది. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఫన్ సెకెండ్ హాఫ్ లో మిస్ అవ్వడం అలాగే సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

ప్లస్ పాయింట్స్ :
కామెడీ
కథలో సస్పెన్సు
కథనం

మైనస్ పాయింట్స్ :

సెకెండ్ హాఫ్ లోని కొన్ని సీన్స్
రొటీన్ ట్విస్ట్ లు, అండ్ క్లైమాక్స్

తీర్పు :

ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ‘మత్తు వదలరా’ ఆసక్తి కరంగా సాగే వినోదంతో కూడిన క్రైమ్ థ్రిల్లర్. దర్శకుడు రితేష్ రాసుకున్న ట్రీట్మెంట్ అండ్ సత్య కామెడీ టైమింగ్. అలాగే కొన్ని సప్సెన్స్ ఎలిమెంట్స్ సినిమాలో బాగా అలరిస్తాయి. మల్టీప్లెక్స్ ప్రేక్షుకులతో పాటు కామెడీ ఇష్టపడేవారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Rating: 3/5