రివ్యూ : ‘మీకు మాత్రమే చెప్తా’ !

 

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా నిర్మిస్తోన్న తొలి చిత్రం.. ‘మీకు మాత్రమే చెప్తా’. దర్శకుడు తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకుదు షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. కాగా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. కాగా మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం, మరి ఆ అంచనాలను ఎంత వరకు అందుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

రాకేశ్ (తరుణ్ భాస్కర్) తన చిరకాల ప్రేయసి శాంతిని (వాణి భోజన్)ను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో అకస్మాత్తుగా అతని ఫోన్ కి ఓ వీడియో వస్తోంది. ఆ వీడియో రాకేశ్ యొక్క ప్రైవేట్ వీడియో. అది గాని బయట పడితే.. ఇక తన పెళ్లి ఆగిపోతుందని.. దాన్ని ఎలాగైనా బయటకు రాకుండా.. హీరోయిన్ కి తెలియకుండా ఉండటానికి రాకేశ్ అండ్ అతని ఫ్రెండ్స్ చాల ప్రయత్నాలు చేస్తారు. చివరికి ఎలాగోలా రాకేశ్ మరియు అతని స్నేహితులు ఆ వీడియో వైరల్ కాకముందే తొలగిస్తారు. ఇక అంతా హ్యాపీ అనుకుని వాళ్ళు రిలాక్స్డ్ అవుతున్న లోపే మళ్లీ ఆ వీడియో బయటకు వస్తోంది. అసలు ఆ వీడియోని మళ్ళీ రాకేశ్‌ కు ఎవరు పంపారు? రాకేశ్ తన స్నేహితుల సహాయంతో వీడియో పంపిన తెలియని వ్యక్తిని మళ్ళీ ఎలా కనుక్కున్నాడు ? చివరగా, అతను శాంతిని వివాహం చేసుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.

 

విశ్లేషణ :

ఈ సినిమా అందరి అంచనాలకు తగ్గట్టుగానే మంచి ఫన్ తో సాగుతుంది. మధ్యలో కథనం కాస్త నెమ్మదించినా కామెడీ బాగుండటంతో చాల వరకూ సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ కి సంబంధించిన వీడియో బయట పడ్డ దగ్గరనుంచీ స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. పైగా సినిమాలో నటీనటులు అద్భుతమైన టైమింగ్ తో మంచి ఫన్ జనరేట్ చేశారు. మెయిన్ గా తరుణ్ భాస్కర్, అతని ఫ్రెండ్స్ మరియు మిగిలిన కీలక పాత్రలకు మధ్య వచ్చే కామెడి ఎపిసోడ్లు బాగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా వీడియో సంబంధించిన సీన్స్ కూడాచాల బాగున్నాయి. సినిమా చూసే ప్రేక్షకుడికి తర్వాత ఏం జరుగుతుంది అనే ఇంట్రస్ట్ కూడా బాగా మైంటైన్ చేశారు. అలాగే కొన్ని సన్నివేశాలు థ్రిల్ కలిస్తాయి, మెయిన్ గా అనసూయ రోల్ కి సంబంధించిన ట్విస్ట్ మరియు అదేవిధంగా ఆ వీడియోకి సంబంధించిన ట్విస్ట్ కూడా చాల బాగుంది. అలాగే ఈ సినిమాలోని మరో ప్రధాన పాత్ర అయినటువంటి అనసూయ క్యారెక్టర్ కథనంలోకి ఎంటర్ అయ్యిన తర్వాత నుంచి సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే తరుణ్, అభినవ్, అనసూయ తమ పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. హీరోయిన్ గా నటించిన వాణి భోజన్ కూడా చాల బాగా నటించింది.

అయితే దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టినా.. ఆ తరువాత కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. సినిమా ట్రీట్మెంట్ మరియు వీడియోకి సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. సినిమాలో ల్యాగ్ సీన్స్ ను తగ్గించి ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా వచ్చి ఉండేది. పైగా కొన్ని కీలక సీన్స్ లో లాజిక్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. వీటికి తోడు కొన్ని సీన్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. స్లోగా సాగుతూ అక్కడక్కడా బోర్ కొడతాయి. ఓవరాల్ గా ప్రేక్షకులకు బాగానే ఆసక్తి కలిగిస్తుంది. సినిమా ఏవరేజ్ గా అనిపిస్తోంది.

 

ప్లస్ పాయింట్స్ :

తరుణ్, అభినవ్ మరియు అనసూయ నటన

కామెడీ సన్నివేశాలు.

వీడియోకి సంబంధించిన ట్రాక్

 

మైనస్ పాయింట్స్ :

కథ సింపుల్ గా అనిపించడం

కథనం ఆకట్టుకునే విధంగా లేకపోవడం.

 

తీర్పు :

‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ వచ్చిన ఈ సినిమా సింపుల్ గా సాగే పక్కా కామెడీ ఎంటర్ టైనర్. సినిమా డీసెంట్ కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తరుణ్, అభినవ్ మరియు అనసూయ మధ్య నడిచే సీన్స్ అలాగే వారి నటన మరియు వీడియోకి సంబంధించిన కొన్ని ఎపిసోడ్లు ఆకట్టుకునే రీతిలో సాగుతాయి. అయితే స్క్రీన్ ప్లే పూర్తిగా ఆకట్టుకోలేకపోవడం మరియు కథ సింపుల్ గా ఉండటం, కొని సన్నివేశాలు ఇంట్రస్ట్ గా సాగకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏవరేజ్ గా నిలుస్తోంది.

రేటింగ్ : 3/5