సమీక్ష : “ఓ బేబీ”

మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా మంచి డిమాండ్ ఉంది.ఇప్పటి వరకు వచ్చిన అనేక సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు.ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంత ప్రధాన పాత్రధారిగా ఒక 70 ఏళ్ల ముసలావిడ 25 ఏళ్ల అమ్మాయిలా మారితే ఎలా ఉంటుందో అని ఒక సౌత్ కొరియన్ సినిమా ఆధారితంగా తెరకెక్కిన “ఓహ్ బేబీ”గా నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే బేబీ(లక్ష్మి) తన యుక్త వయసులోనే భర్తను కోల్పోయి తన పిల్లలు మరియు మనవళ్లతో జీవనం సాగిస్తుంది.పాతకాలపు ప్రవర్తన అలాగే అతి ప్రేమల వల్ల కొన్ని కీలక పరిణామాల వల్ల ఆమె పిల్లలు ఆమెను ఒక వృద్ధాశ్రమంలో విడిచిపెట్టేస్తారు.దీనితో బేబీ తన యుక్త వయసులో కోల్పోయిన కలలన్నిటిని నిజం చేసుకునే క్రమంలో యంగ్ బేబీ(సమంత)గా మారుతుంది.ఈమె అసలు ఎలా మారింది? మారాక తాను అనుకున్నవన్నీ సాధించిందా చివరకు ఏం జరిగింది? ఈ అన్నిటి నడుమ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ జెనరేట్ అయ్యిందో తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

విశ్లేషణ :

ముందుగా నటీనటుల విషయానికి వచ్చినట్టయితే సమంత కోసం ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.ఇది వరకే ఎన్నో సినిమాల్లో తన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు.ఇప్పుడు అంతకు మించే ఇచ్చారు తప్ప తక్కువ చేసారు అని చెప్పడానికి లేదు.అంతగా బేబీ పాత్రలో ఆమె ఒదిగిపోయారు.ఈ సినిమా ద్వారా సమంత లోని కామెడీ టైమింగ్ ను మరోసారి చూడొచ్చు.

అలాగే ఇతర ముఖ్య పాత్రల్లో నటించినటువంటి రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు మరియు రావు రమేష్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం సమకూర్చారు.అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అడవి శేష్ పాత్ర కనిపించేది తక్కువ సేపే అయినా మెప్పిస్తారు.ఇక అలాగే మరో ప్రధాన పాత్రలో నటించిన నాగశౌర్య కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు.

ఇక సినిమా విషయానికి వచ్చినట్టయితే ఈ కాన్సెప్ట్ ముందుగానే చాలా మందికి తెలిసినా వెండి తెరపై చూసినప్పుడు సరికొత్తగానే ఉన్నట్టు అనిపిస్తుంది.వయసులో పెద్దగా ఉన్న వారు యుక్త వయసులోకి మారితే ఎలా ఉంటుంది అన్న పాయింట్ ను దర్శకురాలు నందిని రెడ్డి చాలా చక్కగా బ్యాలన్స్ చేస్తూ తీసుకెళ్తారు.ఆధ్యంతం వినోదభరితంగా మరియు ఆసక్తికరంగా మొదటి సగం సినిమా పూర్తవుతుంది.

సినిమా ఎక్కడా స్లో అవుతున్న భావన కూడా చూసే ప్రేక్షకులకు అనిపించదు.ఇలా గ్రిప్పింగ్ నరేషన్ చేసినందుకు నందిని రెడ్డి పని తీరును మెచ్చుకొని తీరాల్సిందే అని చెప్పాలి.అలాగే కథానుసారం వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగుంటాయి.కానీ సెకండాఫ్ విషయానికి వచ్చినట్టయితే ఎంటెర్టైన్మెంట్ పాళ్ళు బాగానే ఉన్నాసరే అక్కడక్కడా నెమ్మదిగా సాగుతుంది.ఈ విషయంలో నందిని రెడ్డి కాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.కానీ క్లైమాక్స్ అద్భుతంగా ఉండేసరికి దాని ముందు మాత్రం ఇవన్నీ తేలిపోతాయి.

ఇక ఇతర సాంకేతిక వర్గం విషయానికి వచ్చినట్టయితే ఎల్లప్పుడూ వైవిధ్యభరితమైన సినిమాలు అందించే సురేష్ ప్రొడక్షన్స్ వారి నుంచి మరో మంచి సినిమా వచ్చిందని చెప్పాలి.పాటల్లో రిచర్డ్ ప్రసాద్ అందించిన కెమెరా పనితనం సహా నిర్మాణ విలువలు బాగున్నాయి.అలాగే మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు పాటలు పర్వాలేదనిపిస్తాయి తప్ప అతని మార్క్ కనిపించవు.

ప్లస్ పాయింట్స్ :

సమంత అద్భుత నటన
ఎంటర్టైనింగ్ గా సాగే ఫస్ట్ హాఫ్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ నిడివి
సంగీతం

తీర్పు :

మొత్తానికి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఒక 70 ఏళ్ల ముసలావిడ 25 ఏళ్ల యువతిగా మారితే ఎలా ఉంటుందో చూపించే “ఓ బేబీ” సినిమా చూసే ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పాలి.ఆధ్యంతం ఎంటర్టైనింగ్ గా సాగే ఈ సినిమాలో కాన్సెప్ట్ మరియు సమంత నటన,క్లైమాక్స్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలవగా సంగీతం అక్కడక్కడా డ్రాగింగ్ సెకండాఫ్ మైనస్ పాయింట్లుగా నిలుస్తాయి.అలాగే ఎమోషనల్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా ఈ చిత్రం కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉండడం వల్ల ఈ వారాంతంలో తప్పకుండా చూడడానికి “ఓ బేబీ” మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.

Rating: 3.5/5