రివ్యూ : ‘రాజావారు రాణిగారు’

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘రాజావారు రాణిగారు’. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకం పై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా జయ్ క్రిష్ సంగీతం అందించారు. మరి మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎంత వరకు ఆ అంచనాలు అందుకుందో ఇప్పుడు పరిశీలిద్దాం.

కథ:

ప్రేమను వ్యక్త పరచలేని ఓ సామాన్య యువకుడైన రాజా (కిరణ్‌ అబ్బవరం) తన మిత్రలతో కలిసి తమ పల్లెలో సాధారణ జీవితం గడుపుతూ స్కూల్ లైఫ్ నుంచే రాణి (రహస్య గోరఖ్‌)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఎన్నో సార్లు ఆ విషయం ఆమెకు చెప్పాలని అనేక ప్రయత్నాలు చేసినా చివరికీ చెప్పలేక తనలో తానే మదన పడుతూ నలిగిపోతున్న క్రమంలో.. రాణి తన పై చదువుల కోసం వేరే ఊరు వెళ్లిపోతుంది. సంవత్సరాలు గడుస్తోన్నా రాణి రాదు. రాణి ఊరికి రావడానిని రాజా అతని ఫ్రెండ్స్ ఏమి చేసారు? రాజా రాణికి తన ప్రేమ విషయం చెప్పాడా? లేదా? చివరికి తన ప్రేమను గెలుచుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఈ చిత్రంలో ఆహ్లదమైన ప్రేమ సన్నివేశాలు, అలాగే పల్లెటూరి అమాయక స్వభావం కలిగిన స్నేహితుల మధ్య నడిచే హాస్యసన్నివేశాలు సినిమా మొదటి భాగంలో చక్కగా కుదిరాయి. అలాగే పది సంవత్సరాల క్రితం నాటి సమాజాన్ని, ప్రజల సంస్కృతిని దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు. ప్రధాన పాత్రలు చేసిన హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరఖ్‌ ఇద్దరు కొత్తవారైనప్పటికీ, తమ నటనతో ఆయా పాత్రలలో చక్కగా నటించారు. ప్రేమను వ్యక్తపరచలేని యువకుడిగా కిరణ్ నటన చాలా సహజంగా ఉంది. అలాగే హీరోకి అతని ఫ్రెండ్స్ కి మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు వారి నటన కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చౌదరి పాత్ర సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోంది.

అయితే ప్రధాన పాత్రలను తెరపై చక్కగా ఆవిష్కరించిన దర్శకుడు కథనం విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండు నిపిస్తుంది. దీని వల్ల చిత్రం సినిమా నెమ్మదిగా జరుగుతున్న భావన కలుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చిత్రం ఏవరేజ్ గా అనిపించినా సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది. మొదటి సగం ప్రధాన పాత్రల మధ్య జరిగే లవ్ రొమాంటిక్ సన్నివేశాలతో నడిపిన దర్శకుడు రెండవ సంగం ప్రేమ కొరకు పడేపాట్లును చూపించారు. క్లైమాక్స్ లో ఎమోషనల్ సన్నివేశంలో హీరో హీరోయిన్ ఇద్దరూ బాగా నటించారు. ఇక మూవీ కెమెరా వర్క్ బాగుంది. మూవీకి సంగీతం కూడా ఎస్సెట్ అని చెప్పాలి. నేపధ్య సంగీతంతో కొన్ని సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేసారు. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

కామెడీ సీన్స్
నటీనటుల నటన
ఎమోషనల్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:

స్టోరీ
స్క్రీన్ ప్లే

తీర్పు:

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా వచ్చిన ఈ చిత్రం బలమైన నేపథ్యంతో భావేద్వేగమైన ప్రేమ కథతో కొన్ని ప్రేమ సన్నివేశాలతో మరియు మంచి కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకునప్పటికీ… స్టోరీ కాన్సెప్ట్‌ రొటీన్ గా ఉండటం, కథనం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మొత్తం మీద ఈ సినిమా మంచి ఫ్యూర్ ప్రేమ కథా చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు అలరిస్తోందో చూడాలి.

Rating: 2.5/5