మూవీ రివ్యూ : “సాహో”

“బాహుబలి” అనే రెండు చిత్రాల తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి ఒక్క దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.మళ్ళీ ఇప్పుడు అదే స్థాయిలో ప్రకంపనలు రేపుతూ భారీ ఎత్తున అదే స్థాయిలో విడుదల అవుతూ ఎన్నో రికార్డులను వేటాడేందుకు సిద్ధంగా ఉన్న చిత్రం “సాహో”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం నాలుగు భాషల్లో విడుదల అయ్యింది.రొమాంటిక్,సస్పెన్స్,భారతదేశంలోనే మొట్టమొదటి భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కిందని సాహో మేకర్స్ తెలియజేసారు.ఇన్ని అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే అశోక్(ప్రభాస్) ముంబైలో జరిగిన 2000 కోట్ల భారీ దోపిడీ కేసును ఛేదించే పోలీస్ టీమ్ కీలకంగా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే పోలీస్ ఆఫీసర్ అయినటువంటి అమృత(శ్రద్ధా దాస్) కూడా ప్రభాస్ తో కలిసి పని చెయ్యాల్సి వస్తుంది. కానీ ఆ తరువాత జరిగిన సంఘటనలతో ఊహించని మలుపులతో సినిమా ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది. అసలు ఈ బ్లాక్ బాక్స్ ఏమిటి? ఈ భారీ చోరీ నుంచి దీని వైపు కథ ఎందుకు మలుపు తిరిగింది? ఈ పరిస్థితులు మధ్య ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ లు ఎదుర్కొన్నాడు ?మొత్తానికి ఆ దోపిడీ మరియు బ్లాక్ బాక్స్ వెనుకున్న రహస్యం ఏమిటి ? పోలీస్ అశోక్ (ప్రభాస్ )కి, అలాగే సాహో (ప్రభాస్)కి సంబంధం ఏమిటి ? ఇంతకీ ప్రభాస్ ఎవరు ? అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి? తెలియాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

2000 కోట్ల భారీ చోరీతో మొదలైన ఈ మూవీ.. ఫస్టాఫ్ మొదటి నెమ్మదిగానే మొదలవుతున్నట్టు అనిపించినా.. అలా అలా ఇంటర్వెల్ కి ఆసక్తికరంగా మారుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ వన్ మ్యాన్ షోగా సినిమాని తానొక్కడై నడిపించడాని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ ఆరడుగుల కటౌట్ చేసే భారీ యాక్షన్ సీన్స్ అయితే చూపరులను కట్టిపడేస్తాయి. విజువల్స్ కానీ యాక్షన్ సీక్వెన్సులు కానీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి.ప్రభాస్ మరియు శ్రద్ధాల మధ్య కెమిస్ట్రీ అలాగే ఇంటర్వెల్ బ్లాక్ ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. బ్లాక్ బాక్స్ చుట్టూ అల్లుకునే సస్పెన్స్ సినిమాలో ఏం జరుగుతుందా అని ప్రేక్షకుడిని మరింత ఉత్తేజపరుస్తాయి.

ఇక అన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఒకదాన్ని మించి ఒకటి పతాక స్థాయిలో ఉంటాయి. వీటికి మాత్రం థియేటర్లో గూస్ బంప్స్ రావడం ఖాయం.ఈ మజాను థియేటర్లో చూస్తే తప్ప ఎంజాయ్ చేయలేము అనే రేంజ్ లో సినిమాని సుజీత్ తెరకెక్కించారని చెప్పాలి. హీరోయిన్ పాత్ర హీరోకు ఎదురు తిరగడం ఒక ట్విస్ట్ దీనిని ముందు గానే రివీల్ చేసేసారు.అందువల్ల థియేటర్లో ఈ సన్నివేశాలు అంత ఆసక్తికరంగా ఉండవు. పైగా సినిమా మొదటి ముప్పై నిమిషాలు కూడా సాగదీతగానే అనిపిస్తుంది.

ఇక దర్శకుడు సుజీత్ విషయానికి వచ్చినట్టయితే ఈ సినిమా కోసం సుజీత్ పెట్టిన ఎఫర్ట్స్ ను మెచ్చుకొనే తీరాలి. ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చెయ్యడం ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులను తెరకెక్కించిన తీరు బాగుంది. కానీ తాను రాసుకున్న కథను కొన్ని అనవసరమైన సీన్ల కోసం పాడు చేసుకున్నారనిపిస్తుంది. అలాగే ప్రభాస్ ట్రాక్ సహా స్క్రీన్ ప్లే కూడా చాలా గందరగోళంగా అనిపిస్తుంది. అంతే కాకుండా సినిమాలో విలన్ పాత్రలు కూడా బాగా ఎక్కువయ్యారనిపిస్తుంది. సినిమా మొత్తం గందరగోళంగా నడిపే బ్లాక్ బాక్స్ అనే అంశం పై పెట్టిన శ్రద్ధ, అన్ని కోణాల్లో వహించి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది.కానీ చాలా వరకు ఊహించగలిగే కథనం ట్విస్టుల్లో కూడా ఏమాత్రం విస్మయానికి గురి చేసే అంశాలు లేకపోవడం సినిమా ఫలితాన్ని బాగా దెబ్బ తీస్తుంది. ఈ చిత్రం అందరిని ఆకట్టుకోడం కష్టమే.

ఇక నటీనటుల విషయానికి వస్తే చెప్పినట్టుగా ప్రభాస్ డెడికేషన్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా కాగా శ్రద్ధా కూడా ప్రభాస్ కు పోటీగా నటించి తన అద్భుత నటనతో ఆకట్టుకుంటుంది.అలాగే విలన్ రోల్స్ కనిపించిన నీల్ నితిన్,చుంకీ పాండే,తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన మాదీ కెమెరా పనితనం అద్భుతంగా ఉంటుంది,సంగీత దర్శకుడు జిబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయిలో ఎలివేట్ చేస్తుంది.ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది..అలాగే నిర్మాణ విలువలు కూడా.

ప్లస్ పాయింట్స్ :

అన్ని యాక్షన్ సన్నివేశాలు
ప్రభాస్ మరియు శ్రద్ధాల మధ్య కెమిస్ట్రీ
విజువల్స్
ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్ :

కథా కథనాలు
ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండాఫ్ లలో వచ్చే సాగదీత సీన్స్
బోరింగ్ ట్రీట్మెంట్
ఇంట్రస్ట్ గా సాగని మెయిన్ సీక్వెన్స్ స్.
ముందుగానే అర్ధమయ్యే ట్విస్టులు

తీర్పు :

భారీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా ఆసక్తికరంగా సాగలేదు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ వన్ మ్యాన్ ఆర్మీగా తన వన్ మ్యాన్ షోతో అదరగొట్టారు. కానీ ఏమాత్రం కొత్తదనం లేని కథ,కథనాలు, ఇంట్రస్ట్ లేని మరియు అనవసరమైన సన్నివేశాలు వల్ల సినిమా ఫలితం దెబ్బ తింది. ఇప్పటికే ఈ సినిమా పై నెలకొన్న భారీ అంచనాల వల్ల థియేటర్లకు జనాలు రావడం వల్ల భారీ ఓపెనింగ్స్ వచ్చినా, ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోకపోవచ్చు.

Rating: 2.5/5