మూవీ రివ్యూ : “సైరా నరసింహా రెడ్డి”

మెగాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది.టాలీవుడ్ లెజెండరీ నటుడు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ హీరోగా నయనతార మరియు తమన్నాలు హీరోయిన్లుగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్,కిచ్చా సుదీప్,మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణంతో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. భారతదేశానికి మరియు తెలుగు నేలకు చెందిన మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఈ రోజే విడుదల అయ్యింది.అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ చిత్రం ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే 18వ దశకంలో రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి(చిరంజీవి). కానీ అప్పటికే భారతదేశం పై కన్నేసిన బ్రిటిషు దేశస్థులు భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో రేనాడును ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తారు.ఈ నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి దేశ స్వాతంత్య్రం కోసం వారికి ఎదురు తిరుగుతాడు.వారిని ఎదిరించే క్రమంలో అవుకు రాజు(సుదీప్), రాజ పాండి(విజయ్ సేతుపతి), వీరా రెడ్డి(జగపతి బాబు)లు ఎలా తోడయ్యారు?ఆ తర్వాత నరసింహా రెడ్డి ఎదుర్కొన్న పరిణామాలు ఏమిటి? అవి ఎటువైపుకు దారి తీశాయి అన్న అంశాలు తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ సినిమాకు మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి కోసమే.మెగాస్టార్ అభిమానులు చిరును ఇప్పటి వరకు ఇన్ని దశాబ్దాల కాలంలో చూడని ఒక సరికొత్త పాత్రలో మెగాస్టార్ కనబర్చిన నటనా తీరును భేరీజు వెయ్యడానికి మాటలు సరిపోవు.అసలు ఆరు పదులు వయసు వచ్చినా సరే అంత ఎనర్జిటిక్ గా పలికించిన డైలాగ్స్ కానీ కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి.అలాగే మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్పారో ఈ సినిమా చూసి ప్రతీ ఒక్కరికి అర్ధం అవుతుంది.

అస్లు నిజంగా మొట్టమొదటి స్వాతంత్ర్య ఉద్యమకారుడు అయినటువంటి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అంటే ఇలాగే ఉంటారా?ఆ పాత్రలో చిరుని తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్న రీతిలో మెగాస్టార్ పెట్టిన అద్భుత ఎఫర్ట్స్ కోసం ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.ఇక అలాగే కన్నడ హీరో కిచ్చ సుదీప్ తనదైన నటనతో ఆకట్టుకుంటారు.అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటన కోసం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

అంతేకాకుండా ఒక మెగాస్టార్ తో మరో మెగాస్టార్ గోసాయి వెంకన్నగా నరసింహా రెడ్డి గురువు పాత్రలో అమితాబ్ పర్ఫెక్ట్ గా సెట్టయ్యారు.అలాగే మెగాస్టార్ మరియు నయనతారల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే నయన్ అద్భుత నటన కనబరిచారు.అలాగే తమన్నా కూడా ఈ చిత్రంతో మరో మంచి రోల్ చేసి గుర్తుండిపోయే నటనను కనబర్చారు.అంతే కాకుండా చిన్న పాత్ర అయినా సరే నిహారిక మంచి నటన కనబరిచారు.ఈ చిత్రంతో విలక్షణ నటుడు జగపతిబాబు కెరీర్ లో మరో మంచి పాత్ర చేరింది.

ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి విషయానికి వచ్చినట్టయితే ఇటువంటి సబ్జెక్టును సురేందర్ ఇప్పటి వరకు ముట్టుకోకపోయినా ఈ చిత్రాన్ని ఒక అద్భుతంలా తెరకెక్కించారు.ప్రతీ పాత్రకు ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఎవరిని తక్కువ చెయ్యకుండా చాలా జాగ్రత్త వహించి తెరకెక్కించిన తీరుకు హ్యాట్సప్ చెప్పాల్సిందే.అయితే ఫస్ట్ హాఫ్ కథనం అక్కడక్కడా కాస్త నెమ్మదిగా మొదలవుతున్నట్టు అనిపించినా అలా ఇంటర్వెల్ కు వచ్చేసరికి మెగాస్టార్ కు ఎలాంటి ఎలివేషన్లు ఇస్తే మాస్ ఆడియన్స్ మరింతగా కనెక్ట్ అవుతారో లాంటివి బాగా క్యారీ చేసారు.ముఖ్యంగా ఎమోషన్స్ ను చాలా చక్కగా తీర్చిదిద్దారు.

అలాగే సాయి మాధవ్ బుర్రా అందించిన కొన్ని డైలాగ్స్ కి అయితే థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కొన్ని యాక్షన్ బ్లాక్స్ తో సహా ఆ విజువల్స్ ను చూస్తుంటే మాత్రం నిజంగానే 18వ శతాబ్దంలో ఉన్న భావన కలిగి తీరుతుంది.దీనికి మాత్రం రత్నవేలు అందించిన కెమెరా పనితనం అమోఘం.అలాగే సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అందించిన పాటలు ఒక్క టైటిల్ ట్రాక్ మినహా మిగతావి పర్వాలేదనిపిస్తాయి.అలాగే జూలియస్ పకియం అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.రామ్ చరణ్ అందించిన నిర్మాణ విలువలు సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది.

అయితే ఈ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కించక మునుపు చాలా మందికి తెలిసే ఉంటుంది అలాంటి వారికి ఇది వరకే ఈ స్టోరీ తెలుసు కనుక అంతగా మెప్పించకపోవచ్చు.అలాగే అన్ని పాత్రలను తీసుకొని వాటికి సరైన లింకప్ చేయలేకపోవడం వంటివి కాస్త నిరాశపరుస్తాయి.అంతే కాకుండా కొన్ని కొన్ని పార్టులుగా చూసుకున్నట్టయితే సినిమా అద్భుతంగా ఉంది అనిపిస్తుంది కానీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అన్ని వర్గాల ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

భారీ సెట్టింగులు మరియు విఎఫ్ఎక్స్

సినిమాటోగ్రఫీ

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :

కాస్త నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్

కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం

తీర్పు :

మొత్తంగా చూసుకున్నట్టయితే భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర మీద తెరకెక్కించిన “సైరా నరసింహా రెడ్డి” చిరంజీవి అద్భుత పెర్ఫామెన్స్ మరియు థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సెకండాఫ్ ఆకట్టుకున్నా కాస్త నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్ లోని కథనం సినిమా నిడివి ఎక్కువ కావడం వంటివి నిరాశపరుస్తాయి.మరి ఈ పండుగ సీజన్లో మెగాస్టార్ మ్యాజిక్ వర్కౌట్ అయితే సినిమా మంచి ఫలితాన్ని అందుకోవచ్చు.

Rating: 3/5