ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా కన్నుమూశారు. కాసేపటి క్రితం గుండె పోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1960 అక్టోబర్ 30న అర్జెంటీనాలో జన్మించిన మారడోనా గత అక్టోబర్ 30వ తేదిన తన 60వ పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడటం వల్ల మారడోనా మొదడులో రక్తం గడ్డ కట్టడంతో నెల కిందటే ఆయనకు మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్స కూడా జరిగింది. అయితే ఆ ప్రమాదం నుంచి మారడోనా కోలుకున్నప్పటికి.. ఇలా అకస్మాత్తుగా ఆయన మరణించడంతో కోట్లాది అభిమానులు శోక సంద్రంలో మునిగారు.
ఫుట్‌బాల్ పేరు చెబితే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు డిగో మారడోనాదే. పుట్‌బాల్‌లో ఆల్‌టైం గ్రేట్‌గా పేరుగాంచిన మారడోనా 1986లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్ అందించడంలో కీలక పాత్ర పోశించాడు. 1997లో ప్రొఫెషనల్ పుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మారడోనా, 2008లో అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. తన కెరిర్లో మొత్తం 694 మ్యాచ్‌లు ఆడిన మారడోనా 354 గోల్స్ సాధించాడు. అలాంటి మారడోనా దూరమవ్వడం అందరికి షాక్‌నిచ్చింది. ఆయన మృతి పట్ల పుట్‌బాల్ ప్రేమికులు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.