ధోనికి షాక్ ఇచ్చిన బీసీసీఐ.. రిటైర్‌మెంట్ తప్పేటట్టు లేదుగా.!

Thursday, January 16th, 2020, 06:32:15 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం లాంగ్ లీవ్ తీసుకుని ఆర్మీలో పనిచేస్తున్న ధోనికి రిటైర్‌మెంట్ సెగ తగిలింది. తాజాగా ఆటగాళ్ళ నూతన వార్షిక కాంట్రాక్టుల జాబితాలో ధోనీ పేరును బీసీసీఐ ప్రకటించలేదు. టీమిండియాను తన సారధ్యంలో అన్ని ఫార్మాట్లలో ప్రథమస్థానంలో నిలపడమే కాకుండా వన్డే, టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ను కూడా అందించిన ధోనీ పేరు లిస్ట్‌లో లేకపోవడం పలు వివాదాలకు తెరలేపుతుంది.

నేడు భారత జట్టు ఆటగాళ్ళ వార్షిక ఆదాయ ఒప్పందాలను ప్రకటించిన బీసీసీఐ అక్టోబర్‌ 2019 నుంచి సెప్టెంబర్‌ 2020 వరకు అమలులో ఉండనున్న నూతన జాబితాను నాలుగు భాగాలుగా విభజిస్తూ గ్రేడ్‌ ఏ+ ఆటగాళ్ళకు 7 కోట్లు ఇవ్వనుండగా, గ్రేడ్‌ ఏ ఆటగాళ్ళకు 5 కోట్లు, గ్రేడ్‌ బి వారికి 3 కోట్లు, గ్రేడ్‌ సి వారికి కోటి రూపాయలు చెల్లించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే గ్రేడ్ ఏ+ కాంట్రాక్టులో కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా పేర్లు ఉండగా, గ్రేడ్ ఏలో అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, రాహుల్, ధవన్, షమి, ఇషాంత్, కుల్దీప్, రిషబ్ పంత్‌ ఉన్నారు. ఇక బీ గ్రేడ్‌లో సాహా, ఉమేశ్, చాహల్, పాండ్యా, మయాంక్‌లు ఉండగా, సీ గ్రేడ్‌లో జాదవ్, సైనీ, చాహర్, మనీశ్ పాండే, విహారీ, శ్రేయాస్, వాషింగ్టన్ సుందర్‌ ఉన్నారు. అయితే ఈ లిస్ట్‌లో ధోనీ పేరు లేకపోవడంపై బీసీసీఐ ఇదివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.