ఒకే మ్యాచ్‌లో పది వికెట్లు.. వరల్డ్ రికార్డ్ బౌలర్..!

Wednesday, February 26th, 2020, 01:45:56 AM IST

బీసీసీఐ అండర్-19 అంతరాష్ట్ర మహిళల క్రికెట్‌లో భాగంగా నేడు కడప కేఎన్ఆర్ఎం మైదానంలో చండీఘడ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో వరల్డ్ రికార్డ్ ఒకటి నమోదయ్యింది. చండీఘడ్ బౌలర్ కేశ్వీ గౌతమ్ 10 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. అయితే 4.5 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తం 10 వికెట్లను తానే పడగొట్టింది. అంతేకాదు ఈ పది వికెట్లలో ఒక హ్యాట్రిక్ కూడా ఉండడం గమనార్హం.

అయితే చండీఘడ్‌లోని ఓ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కేశ్వీ 7వ తరగతి నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది. అయితే సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కేశ్వీ ప్రపంచ రికార్డ్ నెలకొల్పడంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటీంగ్ చేసిన చండీఘడ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కి దిగిన అరుణాచల్ ప్రదేశ్ కేశ్వీ ధాటికి కుప్పకూలింది. కేవలం 8.5 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది.