పృథ్వీ షా ‘షో’.. కోల్‌‌కతాపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..!

Friday, April 30th, 2021, 01:00:24 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అంతా ఢిల్లీ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. ఓపెనర్ శుభమన్ గిల్ (43)తో రాణించగా చివర్లో ఆండ్రీ రస్సెల్(45)తో రెచ్చిపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ చెరొక 2 వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్, స్టోయినిస్ చెరొక వికెట్ తీశారు.

అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. సూపర్ ఫామ్ లో ఉన్న పృథ్వీ షా మరోసారి చెలరేగిపోయాడు. మొదటి ఓవర్‌లోనే ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్‌లో ఆరు బంతులకు ఆరు బౌండరీలు సాధించిన తొలి ఆటగాడిగా పృథ్వీ షా రికార్డ్ నెలకొల్పాడు. అంతేకాదు 18 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసి ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేశాడు పృథ్వీషా. అయితే పృథ్వీషా దూకుడుగా ఆడుతుంటే శిఖర్ ధావన్ నెమ్మదిగా ఆడుతూ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ ఫస్ట్ వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరిద్దరూ ఔటైనా చివర్లో రిషబ్ పంత్(16), స్టోయినిస్(6) కాలిసి లాంఛనం పూర్తి చేశారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరో 21 బంతులు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ బౌలర్లలో పాట్ కమిన్స్ ఒక్కడే 3 వికెట్లు తీసుకున్నాడు.