ధోనీ విజయం వెనుక వారే ఉన్నారట!

Wednesday, March 11th, 2015, 05:37:08 PM IST


క్రికెట్ ప్రపంచ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. కాగా గతంలో బౌలింగ్ విభాగంలో భారత జట్టు విఫలం అవుతోందంటూ వచ్చిన ఆరోపణలను తోసిరాజని వరల్డ్ కప్ లో భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. ఈ నేపధ్యంగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను విజయవంతం కావడం వెనుక బౌలర్లదే కీలక పాత్రని నిజాయితీగా తెలిపాడు. అలాగే వాళ్ళు ఆటలో రాణించినప్పుడే తాను అత్యుత్తమ కెప్టెన్ లా కనిపిస్తానని ధోనీ పేర్కొన్నాడు.

ఇక బౌలర్లు ప్రణాళికా బద్ధంగా ఆడుతూ తన పనిని సులువు చేస్తున్నారని ధోనీ కితాబిచ్చాడు. అలాగే బౌలింగ్ అలా చెయ్యి.. ఇలా చెయ్యి అని చెబుతూ ఉంటే వారిపై అధిక ఒత్తిడి పెరుగుతుందని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సీరిస్ నుండి భారత బౌలర్లు త్వరగానే పాఠాలు నేర్చుకున్నారని ధోనీ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ప్రపంచ కప్ లో భారత బౌలర్లు షమీ, యాదవ్, అశ్విన్ తదితరులు ప్రత్యర్ధులను పెవిలియన్ బాట పట్టించడమే లక్ష్యంగా చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే.