దంచికొట్టిన బట్లర్.. మూడో టీ20లో టీమిండియా ఓటమి..!

Wednesday, March 17th, 2021, 12:16:57 AM IST


భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20లో భారత్ ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్ వరుసగా వికెట్లను కోల్పోయి ఆదిలోనే కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్(0), రోహిత్ శర్మ(15), ఇషాన్ కిషన్(4), శ్రేయాస్ అయ్యర్(9) వెనువెంటనే ఔటయ్యారు. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్నా విరాట్ కోహ్లీ మాత్రం (77; 46 బంతుల్లో 8×4, 4×6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రిషభ్‌ పంత్‌ (25; 20 బంతుల్లో 3×4), హార్దిక్ పాండ్యా (17; 15 బంతుల్లో 2×6) ఫర్వాలేదనిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ 3 వికెట్లు తీయగా, జోర్దాన్ 2 వికెట్లు తీశాడు.

అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు చక్కటి శుభారంభం లభించింది. ఓపెనర్‌గా వచ్చిన జేసన్ రాయ్(9), మలాన్ (18) త్వరగానే ఔటయినప్పటికీ, మరో ఓపెనర్ జోస్ బట్లర్ (83; 52 బంతులు, 5×4, 4×6) రెచ్చిపోయి ఆడాడు. అతడికి తోడుగా బెయిర్‌స్ట్రో కూడా (40; 28 బంతులు, 4×4) అద్భుతంగా రాణించడంతో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లండ్ మరో 10 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యం సాధించింది.