బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ మెరుపులు.. రెండో వన్డేలో ఓటమిపాలైన భారత్..!

Friday, March 26th, 2021, 11:33:01 PM IST

భారత్-ఇంగ్లండ్‌ మధ్య నేడు జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శికర్ ధావన్ స్వల్ఫ స్కోరుకే ఔటైనా కేఎల్ రాహుల్(108) సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ కోహ్లీ(66), రిషబ్ పంత్‌(77) రాణించగా, చివర్లో హార్థిక్ పాండ్య(35) ధాటిగా ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్‌కరన్, టాఫ్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 337 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ల నుంచి చక్కటి శుభారంభం లభించింది. జానీ బెయిర్‌స్టో(124) సెంచరీతో అదరగొట్టగా, బెన్ స్టోక్స్(99) సెంచరీ మిస్ అయ్యారు. జేసన్‌ రాయ్‌(55) అర్థ సెంచరీతో రాణించారు. అయితే వరుసగా బెయిర్ స్టో, స్టోక్స్, బట్లర్ ఔట్ అయినా డేవిడ్ మలన్, లివింగ్ స్టోన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో కేవలం 43.3 ఓవర్లలోనే ఇంగ్లీష్ టార్గెట్‌ను చేధించింది. వన్డే చరిత్రలోనే తొలిసారి టీమిండియాపై భారీ టార్గెట్ ఛేదించి ఇంగ్లాండ్ హిస్టరీ క్రియేట్ చేసింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు, భువనేశ్వర్ ఓ వికెట్ తీసుకున్నారు. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమయ్యింది. మూడో వన్డే ఈ నెల 28న జరగనుంది.