వయసు పెరిగినా వీరూలో సత్తా తగ్గలేదు.. బంగ్లాపై ఇండియన్ లెజెండ్స్ గెలుపు..!

Saturday, March 6th, 2021, 02:09:12 AM IST


రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ-20లో భాగంగా నేడు రాయ్‌పూర్‌లో బంగ్లాదేశ్ లెజెండ్స్ మరియు ఇండియా లెజెండ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ లెజెండ్స్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బంగ్లా జట్టులో నజీముద్దీన్ 49 పరుగులతో రాణించగా, మిగతా బ్యాట్‌మెన్స్ ఎవరూ రాణించలేదు. ఇక ఇండియా లెజెండ్స్ టీంలో వినయ్ కుమార్, ప్రగ్నాన్ ఓజా, యువరాజ్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ కేవలం 10.1 ఓవర్లలోనే టార్గెట్ ను పూర్తి చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఒకప్పుడు క్రీజులోకి వచ్చి రాగానే దూకుడుగా ఆడే సెహ్వాగ్ మళ్ళీ అదే రిపీట్ చేశాడు. మొదటి ఓవర్లోనే వరుసగా 3 ఫోర్లు, సిక్సు బాది వయసు పెరిగినా తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. కేవలం 36 బంతుల్లోనే 80 పరుగులు (5 సిక్సులు, 10ఫోర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా 26 బంతుల్లో 33 రన్స్ చేసి తన క్లాస్ బ్యాటింగ్ మరోసారి చూపించాడు.