టీ-20 అప్డేట్: విండీస్ చేతిలో ఓటమిపాలైన భారత్..!

Sunday, December 8th, 2019, 10:52:40 PM IST

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరిస్‌లో భాగంగా నేడు తిరువనంతపురంలో జరిగిన రెండవ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. తొలుత విండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అయితే మొదటి మ్యాచ్‌లో రాణించిన ఓపెనర్ కేఎల్ రాహుల్ 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా కేవలం 15 పరుగులే చేసి వెనుదిరిగారు. ఆ తరువాత వచ్చిన శివమ్ దూబే 30 బంతులలో 54 పరుగులు చేసి భారత్ స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. ఫోర్లు, సిక్స్‌లతో భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్న సమయంలో క్యాచ్ ఔట్ అయి వెనుదిరిగాడు. కాగా శివమ్ దూబేకి ఇది టీ20 కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ. కెప్టెన్ కోహ్లీ 19 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా చివరలో రిషబ్ పంత్ 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో టీమిండియా విండీస్‌కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అయితే అన్నతరం బ్యాటింగ్‌కి దిగిన విండీస్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. సిమ్మన్స్ 45 బంతులలో 67 పరుగులు (నాటౌట్), లెవిస్ 35 బంతులలో 40 పరుగులు, హెట్‌మేయర్ 14 బంతులలో 23 పరుగులు, నికోలస్ పూరన్ 18 బంతులలో 38 పరుగులు చేయడంతో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే విండీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే టీమిండియా బౌలర్లలో జడేజ, వాషింగ్టన్ సుందర్‌కి చెరో వికెట్ మాత్రమే లభించింది. అయితే మూడో టీ-20 ఈ నెల 11న ముంబైలో జరగనుండగా సిరీస్ నెగ్గాలంటే ఏ జట్టుకైనా ఈ మ్యాచ్ విజయం తప్పనిసరిగా మారింది.