ఇండియా దాడికి విండీస్ తట్టుకోగలదా..? నేటి నుండే టెస్ట్ సిరీస్

Thursday, August 22nd, 2019, 11:37:17 AM IST

టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనలో వరస విజయాలతో దూసుకొని వెళ్తుంది. ట్వంటీ -ట్వంటీ లో అదరకొట్టి, వన్డేలో ఒక ఊపు ఊపేసి రెండు సిరీస్ లను కైవసం చేసుకున్న టీం ఇండియా, ముచ్చటగా టెస్ట్ లు ద్వారా మూడో సిరీస్ ని కైవసం చేసుకోవాలని చూస్తుంది. రెండు టెస్టుల్లో భాగంగా మొదటి టెస్ట్ ఈ రోజు వివియన్‌ రిచర్డ్స్‌ మైదానంలో భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల నుండి ప్రసారం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ ఇండియా ఆడనున్న తొలి టెస్టు మ్యాచ్‌ ఇదే.

వరస విజయాలతో ఉన్న ఇండియాని తట్టుకొని నిలబడటం విండీస్ కి కొంచం కష్టమే, అయితే గతంతో పోలిస్తే విండీస్ యువ ఆటగాళ్లతో కొంచం గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఎంతో బలమైన ఇంగ్లాండ్ ని సొంతగడ్డ మీదే 2-1 తేడాతో ఓడించింది విండీస్, కాబట్టి విండీస్ ని తక్కువ అంచనా వేయటానికి ఛాన్స్ లేదు. కెప్టెన్ హోల్డర్‌ ఆధ్వర్యంలో డారెన్‌ బ్రావోతో పాటు షై హోప్‌, క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, జాన్‌ క్యాంప్‌బెల్‌, ఛేజ్‌, రోచ్‌ లాంటి ఆటగాళ్లతో కరేబియన్ జట్టు బలంగా కనిపిస్తుంది.

ఇక టీం ఇండియా కూడా బలమైన ఆటగాళ్లతో సిద్ధంగా ఉంది. టెస్ట్ స్పెషలిస్ట్ ఆటగాళ్లు పుజారా,మయాంక్ అగర్వాల్,అశ్విన్,ఇషాంత్ శర్మ లతో పాటుగా మొదటి రెండు సిరీస్ లకు దూరంగా ఉండిపోయిన బుమ్రా కూడా జత కావటంతో జట్టు దుర్బేధ్యంగా మారిపోయింది. రోహిత్ మరియు రహానే మధ్య మిడిలార్డర్ లో పోటీనెలకొని ఉంది. అలాగే పంత్ ని ఆడించాలా లేక టెస్ట్ స్పెషలిస్ట్ కీపర్ వృద్ధిమాన్ సాహాని ఆడించాలా అనే ఆలోచనలో టీం ఇండియా ఉంది. అదే విధంగా నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు తో దిగాలా, లేక అల్ రౌండర్ జడేజాని తీసుకోవాలా అనే విషయంలో కూడా కొంచం తర్జన భర్జనలు ఉన్నాయి.