ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం.. ఆఖరి మ్యాచ్ రసవత్తరం..!

Friday, January 17th, 2020, 09:58:08 PM IST

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్‌డేల మ్యాచ్ సిరిస్‌లో భాగంగా నేడు రాజ్‌కోట్‌లో జరిగిన రెండవ వన్‌డేలో భారత్ ఘన విజయం సాధించింది. మొదటి వన్‌డే మ్యాచ్‌లో ఓడిన భారత్ ఈ మ్యాచ్ గెలవడంతో సిరీస్‌పై ఆశలను సజీవంగా నిలుపుకుంది. అయితే టాస్ గెలిచి ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ 42 పరుగులు (44 బంతులలో), శిఖర్ ధావన్ 96 పరుగులు (90బంతులలో) చేశారు. కోహ్లీ 78 పరుగులు, లోకేశ్ రాహుల్ 80 పరుగులు చేయడంతో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి భారత్ 340 పరుగులు చేయగలిగింది.

అనంతరం 341 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కి ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్లు వార్నర్ 15 పరుగులు, ఫించ్ 33 పరుగుల స్వల్ఫ స్కోరుతోనే ఔటయ్యారు. అయితే స్టీవ్ స్మిత్ 98 పరుగులు చేయగా సెంచరీ మిస్ అయ్యింది. లబుస్‌చగ్నె 46 పరుగులు చేయగా, మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. చివరలో భారత్ రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ వరుసగా పెవిలీయన్ బాట పట్టారు. ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 304 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా, శైనీ, జడేజా, కుల్దీప్‌లు 2 వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు. ఇకపోతే ఈ నెల 19 న మూడో వన్‌డే మ్యాచ్ బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో జరగబోతుంది. అయితే సిరీస్ నెగ్గాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.